వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మండలి రద్దుపై ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలలో 86 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. వైకాపా నేతలపై వేధింపులు, హత్యాయత్నం, అపహరణ కేసులున్నాయని అన్నారు. ఈ కేసుల గురించి సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. బిల్లుల విషయంలో రాజకీయాలు ఎవరు చేశారో చెప్పాలని నిలదీశారు.
' సంవత్సరంలో 60 రోజులు మండలి సమావేశాలు జరుగుతాయనుకుంటే.. రోజుకు రూ.కోటి చొప్పున రూ.60 కోట్లు వృథా అన్నట్లు జగన్ మాట్లాడారు. తనపై కేసుల విచారణకు ప్రతివారం కోర్టుకు హాజరవ్వాలంటే భద్రతకే రూ.60 లక్షల చొప్పున ఖర్చవుతుంది. ఆయన ఏడాదికి 50 వారాలు కోర్టుకు వెళ్తారనుకున్నా.. రూ.30 కోట్లు ఖర్చవుతుంది. ఒక నిందితుడు హైకోర్టుకు వెళ్లడానికి భద్రత కోసం రూ.30 కోట్లు ఖర్చు పెడుతూ.. మండలి సమావేశాలకు రూ.60 కోట్లు వృథా అనడం విడ్డూరం కాదా? జగన్ తన కేసులు వాదిస్తున్న న్యాయవాదికి, అమరావతి కేసుల పేరుతో రూ.5 కోట్ల ప్రభుత్వ ధనం ఇవ్వడం , తన సొంత ఇంటి భద్రత కోసం రూ.41 కోట్లు మంజూరు చేస్తూ.. జీవో ఇవ్వడం వృథా కాదా?' అని చంద్రబాబు మండిపడ్డారు.
ఓటింగ్ సమయంలోనూ నాటకం
మండలి రద్దు తీర్మానంపై సభలో చేపట్టిన ఓటింగ్ సమయంలోనూ నాటకం ఆడారని చంద్రబాబు అన్నారు. మొదట సభలో 121 మంది ఉన్నారని చెప్పి.. చివరికి 133 మంది ఉన్నారని చెప్పారని తెలిపారు. ఇటీవల కాలంలో 10 రాష్ట్రాలు మండలిని పునరుద్ధరించాలని కోరిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.
వీడియోల ప్రదర్శన....
మీడియాతో మాట్లాడిన చంద్రబాబు...మండలి పునరుద్ధరణపై నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం మాట్లాడరనే దానిపై వీడియో టేపులను ప్రదర్శించారు.అదే సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మండలిపై మాట్లాడిన వ్యాఖ్యలను చూపించారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని చెప్పే జగన్...ఇలా ఎలా చేశారని ప్రశ్నించారు. తన అనవసరాలకు అనుగుణంగా మాట మార్చే వ్యక్తి జగన్ అని చెప్పుకొచ్చారు.
ఐదు కోట్లు ఎలా చెల్లిస్తారు...
మండలికి 60 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పే జగన్...తన వ్యక్తిగత కేసుల విషయంలో హాజరయ్యేందుకు భద్రత కోసం కోట్ల రూపాయలు ఎలా ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు.
ఆంగ్లమాధ్యానికి మేం వ్యతిరేకం కాదు..
మాతృభాషను కాపాడుకోవాలని మాత్రమే తాము చెప్పామని చంద్రబాబు తెలిపారు. ఆంగ్ల మాధ్యమాన్ని మేం వ్యతిరేకించలేదన్నారు. విమర్శలు చేయడం పత్రికల బాధ్యత అని...అది వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని వ్యాఖ్యానించారు. కానీ వైకాపా ప్రభుత్వం...కొన్ని మీడియా సంస్థల పట్ల కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భయభ్రాంతులకు గురి చేసే యత్నం...
మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించారని అన్నారు. ఛైర్మన్‌తో పాటు తెదేపా ఎమ్మెల్సీలపై ఇష్టానుసారంగా మాట్లాడరని పేర్కొన్నారు. గడిచిన నాలుగు రోజుల్లో తెదేపా ఎమ్మెల్సీలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారని...కానీ అలాంటి బెదిరింపులకు తమ ఎమ్మెల్సీలు లొంగలేదని అన్నారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించినందుకే... ఉదయం కేబినెట్లో మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.