అసెంబ్లీ నిర్వహణ తీరు అత్యంత దారుణం, బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో తెదేపా సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని చంద్రబాబు ఆరోపించారు. పీపీఏలపై తెదేపా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సభలో మైక్‌లు ఇవ్వడం లేదన్నారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి ఎదురుదాడికి దిగుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించే దృశ్యాలు, వాదన బయటకు కనబడకుండా చేస్తున్నారని ఆరోపించారు. సమావేశాల అనంతరం చంద్రబాబు మంగళగిరిలో మాట్లాడారు.
'సభలో మేమున్నామో? లేమో? ప్రజలకు అనుమానం కలిగేలా చేస్తున్నారు. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5లను గత సమావేశాల్లోనూ, ఈ సమావేశాల్లోనూ నియంత్రించడం దుర్మార్గం'
.... చంద్రబాబు, తెదేపా అధినేత
ఉల్లి కొరతపై మంత్రులు ఎగతాళి
ఉల్లికి బదులు క్యాబేజీ వాడొచ్చని మంత్రులు ఎగతాళి చేస్తున్నారన్న చంద్రబాబు... సభలో బిల్లుకు, చర్చకు తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్రంలో.. ఉల్లి కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లిపై వైఫల్యాలను తప్పించుకునేందుకు మహిళా భద్రత అంశాన్ని అడ్డం పెట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు. ఉల్లి దొరక్క ప్రజలు చనిపోతుంటే వారి ప్రాణాలకు విలువ లేనట్లు వైకాపా ప్రవర్తిస్తుందన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళలపై అరాచకాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. నెల్లూరులో సరళపై దాడికి పాల్పడింది ఎవరని ప్రశ్నించారు.