ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

3 రాజధానుల ఆలోచన ప్రమాదకరం: చంద్రబాబు - మూడు రాజధానులపై చంద్రబాబు కామెంట్స్

అమరావతిపై వైకాపా కక్షగట్టిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాత్రికి రాత్రి ప్రజావేదిక కూల్చేసి పాలన ప్రారంభించిన వైకాపా... ప్రజాధనం దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆగ్రహించారు. రాజధానిపై వైకాపా మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. విశాఖలో వైకాపా నేతలకు భూములున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయన్న చంద్రబాబు... రాజధానుల్లో విశాఖ పేరు చెప్పడం వెనక అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు.

chandrababu naidu
పక్కా ప్లాన్​ ప్రకారం రాజధానుల్లో విశాఖ పేరు : చంద్రబాబు

By

Published : Dec 17, 2019, 10:10 PM IST

'ప్రజావేదికను జూన్‌ 25 రాత్రి కూల్చేశారు. ప్రజావేదిక నిర్మాణానికి సుమారు ఏడున్నర కోట్లు ఖర్చయ్యాయి. ప్రజావేదికలోని సామగ్రి అంతా నేలపాలు చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఏమేరకు సబబు? ప్రజావేదిక కూల్చి అక్కడున్న శిథిలాలను కూడా తీయలేకపోయారు. అమరావతిపై మీకెందుకు అంత కోపం?. రాజధానికి రూపాయి పెట్టుబడి అవసరం లేదని పలుసార్లు చెప్పాం. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. 3 రాజధానుల ఆలోచన ప్రమాదకరం'

.... చంద్రబాబు, తెదేపా అధ్యక్షుడు

ఓ సామాజిక వర్గంపై అవాస్తవ ప్రచారం

ఉండవల్లిలో మాట్లాడుతున్న చంద్రబాబు

రాజధాని నిర్మాణం చేపట్టమంటే.. ఇన్​సైడ్ ట్రేడింగ్ ఆరోపణచేస్తూ... తెదేపా నేతల పేర్లు చెప్పి లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిపై వైకాపా నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. అమరావతి కోసం రైతులు త్యాగం చేసి భూములిచ్చారన్న చంద్రబాబు... కావాలనే ఒక సామాజికవర్గంపై బురద జల్లుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాన్‌పిక్‌, లేపాక్షి, ఇడుపులపాయలో పేదల భూములు కబ్జా చేశారన్నారు. వరదలు వస్తే అమరావతి మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహించారు.

తుగ్లక్ మాదిరి పరిపాలన

ఉండవల్లిలో మాట్లాడుతున్న చంద్రబాబు

అమరావతిలో రూ.2 లక్షల కోట్ల విలువైన సంపద సృష్టిస్తే... ఇప్పుడు రాజధానినే ప్రశ్నార్థకం చేశారన్నారు. రాజధాని వస్తేనే ఆదాయం పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు. రాజధానిపై స్పష్టత ఇవ్వమని కోరడం తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని తుగ్లక్‌ మాదిరిలా పరిపాలన చేస్తున్నారన్నారు. రాజధానిని ఎవరైనా 3 ప్రాంతాల్లో పెడతారా? అని చంద్రబాబు నిలదీశారు. ఏకపక్ష నిర్ణయాలు, తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. జగన్ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందన్నారు. వితండవాదంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు.

సీఎం ఎక్కడ ఉంటారు?

ఉండవల్లిలో మాట్లాడుతున్న చంద్రబాబు

విశాఖలో డేటా సెంటర్, లులూ కన్వెన్షన్‌ సెంటర్‌ రద్దు చేశారన్న చంద్రబాబు.. ఇలాంటి నిర్ణయాల వల్ల ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. సీఎం అమరావతిలో ఉంటారా.. విశాఖలో ఉంటారా.. ఇడుపులపాయలో ఉంటారా అని ప్రశ్నించారు. శాసనసభ, సచివాలయం, హైకోర్టు వేరువేరు చోట్ల ఉంటే అనేక ఇబ్బందులు వస్తాయన్నారు.

ఆ ఖర్మ తెదేపాకు లేదు

బినామీల పేరుతో భూములు కొనే ఖర్మ తెదేపా నేతలకు లేదన్నారు. వైకాపా నేతలు విశాఖలో భూములు కొన్నారనే ఆరోపణలు ఉన్నాయని ఆరోపించారు. పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా జగన్ పాలన ఉందని చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్‌ ఎప్పుడేం చేస్తారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కమిటీ నివేదిక ఇవ్వకముందే రాజధానుల విషయం సభలో ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తెదేపాను ఏదో చెద్దామని వారే బఫూన్లు అయ్యారన్నారు.

ముఖ్యమంత్రే.. అసత్యాలు చెప్పారు

తప్పుడు నిర్ణయాల వల్ల ప్రాంతీయ విభేదాలు పెరిగే ప్రమాదం ఉందన్న చంద్రబాబు.. బాధ్యత కలిగిన నేతలు ఇలా చేయకూడదని హితవు పలికారు. ఈ ప్రభుత్వం వల్ల ఆదాయం బాగా పడిపోయిందన్నారు. ఈ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్తోందన్నారు. సభలోకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే తెదేపాపై అసత్యాలు ప్రచారం చేశారన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై ఎన్నిసార్లు అడిగినా జవాబు చెప్పలేదని వ్యాఖ్యానించారు. వైకాపా పాలనపై ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా ఆలోచించాలని చంద్రబాబు అన్నారు.

ఒక్క పెట్టుబడి తెచ్చారా..?

రాజధానిలో వైకాపా నేతలకు భూములున్నాయన్న ఆరోపణలు ఉన్నాయనీ... ఇప్పుడు పక్కా ప్లాన్ ప్రకారమే రాజధానుల పేర్లలో విశాఖ పేరు చెబుతున్నారని చంద్రబాబు చెప్పారు. 4 లక్షలమందికి ఉద్యోగాలు ఇచ్చారని గొప్పలు చెప్పుకున్న వైకాపా నేతలు... జీతాలు మాత్రం ఇవ్వలేని పరిస్థితి తెచ్చారన్నారు. భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. వైకాపా ఏడు నెలలపాలనలో..రాష్ట్రానికి ఒక్కటైనా పెట్టుబడి వచ్చిందా అని చంద్రబాబు నిలదీశారు.

ఇదీ చదవండి:

రెండు సీట్లతో కేసీఆర్ తెలంగాణ సాధించలేదా?: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

ABOUT THE AUTHOR

...view details