ఓటమి భయంతో వైకాపా దాడులకు తెగబడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా సానుభూతిపరులపై దాడులు హేయమైన చర్య అన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఓటమి భయం వైకాపా నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందన్న ఆయన.. దాడులు, దౌర్జన్యాలతో ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు.
విశాఖలో పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ పరిశీలనకు వెళ్తే అరెస్టు చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్, ఎమ్మెల్యే వెలగపూడిని అరెస్టు చేశారన్నారు. మచిలీపట్నం 13వ డివిజన్‌లో దినకర్‌పై కత్తులతో దాడి చేశారని మండిపడ్డారు. వైకాపా నేతల దాడులకు పోలీసులు అండగా నిలవడం దారుణమని పేర్కొన్నారు.