రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలపై దాడులే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎస్సీలపై వైకాపా దమనకాండను నిరసిస్తూ'తెలుగుదేశం దళిత శంఖారావం 'పేరిట చేపట్టిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ చంద్రబాబు మాట్లాడారు. నేరస్థుడు పాలకుడైతే నేరగాళ్లు ఎంతగా రెచ్చిపోతారో.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా సంఘటనలే ఉదాహరణ అని దుయ్యబట్టారు.
ఎస్సీలకు బాసటగా చలో ఆత్మకూరుతో పోరాటం ప్రారంభించామన్న ఆయన... 15 నెలల్లో 150కిపైగా దాడులు, 4 హత్యలు, 2 శిరోముండనాలతో, దమనకాండ సాగుతోందని ఆరోపించారు. అంబేడ్కర్ కలలు కని రాసిన రాజ్యాంగం ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మొదటినుంచే సీరియస్గా ఉంటే వరుస ఘటనలు జరిగేవి కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
దళితులపై జరిగిన దాడులన్నిoటిపైనా సీబీఐ విచారణ జరిపించాలి. బాధితులకు రూ.50లక్షల నుంచి రూ. కోటి పరిహారం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు... అక్రమ కేసులు ఎత్తేసి బలవంతంగా లాక్కున్న భూములు వెనక్కి ఇవ్వాలి. అన్ని గ్రామాల్లో దళితులంతా ఆలోచన చేయాలి. వైకాపా ప్రభుత్వం వచ్చాక అదనంగా ఏమైనా చేకూరిందా అని బేరీజు వేసుకోవాలి. సంఘటితంగా పోరాడేందుకు కలసి రావాలి -చంద్రబాబు, తెదేపా అధినేత