నేరగాళ్ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చి ఎవరినీ స్వేచ్ఛగా బతకనివ్వట్లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ చేతిలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని దుయ్యబట్టారు. సలాం కుటుంబానికి జరిగిన అన్యాయంపై వచ్చే 3 రోజులు అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఇన్ఛార్జులు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
"సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యల కేసు దర్యాప్తు సీబీఐకి ఇవ్వటంతో పాటు దుర్ఘటనపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి, కారకులైన అధికారులను సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలి. సలాం కుటుంబానికి మద్దతుగా వచ్చే 3 రోజులు అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, ప్రత్యేక ప్రార్థనలు జరపాలి. శుక్రవారం మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించాలి."
---చంద్రబాబు, తెదేపా అధినేత
వైకాపా దమనకాండ
నంద్యాలలో అబ్దుల్ సలాం, బొమ్మూరులో సత్తార్, రాజమహేంద్రవరంలో బాలిక ఘటనలు మైనార్టీలపై వైకాపా దమనకాండకు ప్రత్యక్ష సాక్ష్యాలని చంద్రబాబు ధ్వజమెత్తారు. పల్నాడులో 100కుపైగా ముస్లిం కుటుంబాలు గ్రామ బహిష్కరానికి గురయ్యాయని, చీరాల, గురజాల, పుంగనూరుల్లో ఎస్సీలపై వైకాపా దమనకాండ సాగిందని చంద్రబాబు అన్నారు. కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యలు, సామూహిక అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేవన్నారు.
సలాంను తొలుత బంగారం దొంగతనం నేరంపై పోలీసులు వేధించారని, ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటే డబ్బులు పోయాయని మళ్లీ నేరం మోపటంతో పాటు అతని భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించి కుటుంబసభ్యులను మానసిక క్షోభ పెట్టారని చంద్రబాబు అన్నారు. భార్యా బిడ్డలతో సహా రైలు కిందపడి సలాం సామూహిక ఆత్మహత్య చేసుకోవటం వైకాపా ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ట అని పేర్కొన్నారు.
నాసిరకం మద్యం బ్రాండ్లు, అధిక ధరలపై మాట్లాడినందుకు ఎస్సీ యువకుడు చనిపోయే పరిస్థితి కల్పించారు. రాజమహేంద్రవరంలో 17 ఏళ్ల బాలికపై 12 మంది సామూహిక అత్యాచారం చేశారని, ఏ ఊరయ్యా మీది అని పొరుగూరు వారిని ప్రశ్నించిన రాజధాని రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి బేడీలు వేసి జైలుకు పంపారని గుర్తు చేశారు. నెల్లూరులో ధాన్యం చెల్లింపుల్లో అవినీతి కుంభకోణాలను బయటపెట్టిన రైతు జైపాల్పై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఇంత మందిపై తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, గృహనిర్బంధాలు, కక్ష సాధింపు చర్యలు గతంలో ఎన్నడూ లేవని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.