కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల బిల్లుల పెండింగ్‌లో పెట్టడం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా నిర్మాణ, వ్యాపార, సేవల రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోవడానికి జగన్ కారణమయ్యారని మండిపడ్డారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదని టెండర్లో నిబంధన పెట్టడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లకూడదనే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీశారు. జగన్ సర్కారు మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కిపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దని టెండర్ డాక్యుమెంట్లోనే నిబంధన పెట్టడం... రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు.
కృష్ణా డెల్టా కాలువల మరమ్మతుల టెండర్లో బిల్లుల కోసం ఒత్తిడి తేవొద్దని ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు రాష్ట్ర పరువు తీశాయని ఆక్షేపించారు. పాలకులకు ఇది సిగ్గుగా అనిపించిందో లేదో కానీ... రూ.13 కోట్ల టెండర్ పనిలో బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దనే నిబంధన పెట్టడం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లే హక్కు లేదంటూ నిబంధన పెట్టే హక్కు అసలు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లిన ముఖ్యమంత్రిని ఏమనాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కారణంగా ఆయా సంస్థలు దివాళ తీయడం సమాజంపై ఎంతటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవాలని హితవు పలికారు.