ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా కేసులపై ప్రభుత్వ హెల్త్ బులెటిన్లు బోగస్' - Chandrababu on cm jagan

కరోనా కేసులపై ప్రభుత్వ హెల్త్ బులెటిన్లు బోగస్ అంకెలు వెల్లడిస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. కరోనా పరీక్షలను బూటకంగా మార్చారని ధ్వజమెత్తారు. పొంతనలేని లెక్కలతో గందరగోళం చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ సీనియర్‌ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు... వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Chandrababu Criticize Jagan over corona control
పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌

By

Published : Apr 17, 2020, 7:01 PM IST

పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌

కరోనా కేసులపై ప్రభుత్వ హెల్త్ బులెటిన్లు బోగస్ అంకెలు చూపిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కరోనా పరీక్షలపై కేంద్రానికి, ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లా యంత్రాంగం లెక్కలు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లో తేడాలున్నాయని పేర్కొన్నారు. కరోనా పరీక్షలను బూటకంగా మార్చారన్న చంద్రబాబు... సీఎం డ్యాష్ బోర్డు అంకెలకు, హెల్త్ సెక్రటరీ లెక్కలకు పొంతనలేదని దుయ్యబట్టారు.

12 గంటల్లో 8,622 పరీక్షలా..?
మొన్న సాయంత్రం 11,613 శాంపిల్స్ పరీక్ష చేసినట్లు డ్యాష్ బోర్డులో చూపారన్న చంద్రబాబు... నిన్న ఉదయానికి 20,235 పరీక్షలు చేసినట్లు చూపించారని గుర్తు చేశారు. 12 గంటల్లో 8,622 పరీక్షలు ఎలా చేశారు..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 7ల్యాబ్‌ల్లో రోజుకు 990 పరీక్షలు చేస్తామని చెప్పారన్న తెదేపా అధినేత... దేశంలోని 263 ల్యాబ్‌ల్లో నిన్న 27,256 టెస్టులు జరిగాయని వివరించారు. రాష్ట్రంలోని 7 ల్యాబ్‌ల్లో 12 గంటల్లో 8,622 పరీక్షలెలా అని నిలదీశారు.

పొంతనలేని లెక్కలతో గందరగోళం...
ఆరోగ్యశాఖ కార్యదర్శి 16,555 టెస్టులు చేసినట్లు చెప్పారన్న చంద్రబాబు... పొంతనలేని లెక్కలతో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ ఎత్తేయించాలని వైకాపా నేతలు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల అశ్రద్ధ, అబద్ధాల వల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు. సీఎం జగన్ అసమర్థత వల్లే ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నియంత్రణలో నిర్లక్ష్యం...
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కచ్చితంగా మానవ తప్పిదమేనని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర వైద్యశాఖ నివేదిక మేరకు 84 శాతం జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయన్న చంద్రబాబు... కరోనా నియంత్రణలో సీఎం జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ప్రజారోగ్యం కంటే ఇతర అంశాలకు సీఎం ప్రాధాన్యత ఇచ్చారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికలు, ఎస్‌ఈసీ తొలగింపునకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. వ్యాక్సిన్ వస్తేనే కరోనా నివారణ సాధ్యమన్న చంద్రబాబు... అప్పటివరకు నియంత్రణ తప్పదని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details