తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై నాయకులతో చర్చించారు. పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతూ.. కేసులు పెట్టి వేధిస్తున్నారని కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైకాపా పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీ ప్రాణాలకే భద్రత లేదని ధ్వజమెత్తారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాయడం రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమన్నారు.
తన ప్రాణాలకు హాని ఉందని, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కేంద్ర భద్రత కావాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గతంలోనే లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షాల నేతలను ఇదే అంశంపై గతంలో లేఖలు పంపారని, వీటన్నింటినీ పరిశీలిస్తే రాష్ట్రంలో వైకాపా ఎంత భయోత్పాతం సృష్టిస్తుందో అర్ధమవుతోందని చంద్రబాబు అన్నారు.
అన్నింటిలోనూ అవినీతే..
ఇంటింటికీ 3 మాస్కులు అందిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. మాస్కుల తయారీలో వైకాపా నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కరోనా కిట్లు, బ్లీచింగ్ కొనుగోళ్లలోనూ కుంభకోణాలేనని ధ్వజమెత్తారు. చివరికి అంబులెన్సుల విషయంలోనూ రూ. 307 కోట్ల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అంబులెన్సుల కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ విజయసాయి రెడ్డి అల్లుడిది కాదా అని ప్రశ్నించారు. సరస్వతి పవర్ సొంత కంపెనీ అవునా ? కాదా ? దానికి నీళ్లు, గనులు ఎలా కేటాయిస్తారని అడిగితే సెక్రటరీతో నోటీసులిస్తారా అని చంద్రబాబు నిలదీశారు. అవినీతికి పాల్పడిన వాళ్లను వదిలేసి.. అక్రమాలను ప్రశ్నించిన వాళ్లను తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.