ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CHANDRABABU: అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అంధకారమే - చంద్రబాబు వార్తలు

అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు.

CHANDRABABU
CHANDRABABU

By

Published : Nov 2, 2021, 5:31 AM IST

రైతుల మహా పాదయాత్రకు చంద్రబాబు సంఘీభావం

‘అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేం. అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అంధకారం అవుతుంది. రైతులు చేపట్టింది పాదయాత్ర కాదు, రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర. అయిదు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి. రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నా’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సోమవారం ట్వీట్‌ చేశారు. పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలోనూ పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ‘విభజనతో రాజధానిలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలింది. అమరావతి నిర్మాణంతో స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతున్న తరుణంలో, మూడు రాజధానుల పేరిట రివర్స్‌ పాలనకు తెరలేపారు. కన్నతల్లి వంటి భూములను రాష్ట్ర భవిష్యత్‌ కోసం త్యాగంచేసిన పుడమితల్లి వారసులు చేస్తున్న ఉద్యమమిది. పాలకపక్షం ఎన్ని అసత్య ప్రచారాలు చేసి, అవమానాలకు గురిచేసినా బెదరకుండా ఆశయ సాధనకోసం చేస్తున్న ఈ ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మహా పాదయాత్రతో సీఎం కళ్లు తెరుచుకోవాలి. పగలు, ప్రతీకారాలు, కూల్చివేతలు, రద్దులపై సీఎం చూపుతున్న శ్రద్ధ, రాష్ట్రాభివృద్ధిపై చూపడంలేదు. ఈ పాదయాత్రకు ప్రజలు, ప్రజా సంఘాలు, తెదేపా నేతలు, కార్యకర్తలు, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలి’ అని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రగతి నాశనానికి జగన్‌ నాయకత్వం

అభివృద్ధి నాశనానికి జగన్‌ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. పక్క రాష్ట్ర సీఎంలు రాష్ట్రంపై హేళనగా మాట్లాడుతుంటే భాధ కలుగుతోంది. దీనికి జగన్‌ చేతకానితనమే కారణం. రైతులు 685 రోజులుగా ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు. రైతుల పాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేకపోతున్నా

‘‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదని అడిగితే సమాధానం చెప్పలేకపోవడం అవమానంగా ఉంది. రాష్ట్రంలో రేపిస్టులు, దోపిడీ దొంగలు, ఆర్థిక నేరగాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారు. న్యాయబద్ధంగా పోరాడే వారిని మాత్రం అడ్డుకుంటున్నారు. పాదయాత్రకు ఆంక్షలు పెట్టాల్సిన అవసరమేంటి..? ఒకవేళ శాంతిభద్రతల సమస్య వస్తే అది వైకాపా ప్రభుత్వం వల్లే వస్తుంది. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తేనే అమరావతి సాధ్యమవుతుంది. తిరుపతి సభలో స్వయంగా పాల్గొంటా’’

చరిత్ర పుటలో రాజధాని ఉద్యమం

ఒక రాజధాని అంశంపై 685 రోజులపాటు జరిగిన ఉద్యమం... దేశంలో ఎక్కడా లేదు. ఇది చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఎన్నికల సమయంలో జగన్‌ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని, రాజధాని ప్రాంతంలోనే ఉన్నట్లు సంకేతాలిచ్చారు. అధికారంలోకి వచ్చాక రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితికి తీసుకువచ్చారు.

మూడు రాజధానుల పేరిట చిచ్చు

‘‘మూడు రాజధానుల పేరిట ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. రైతులకు సకాలంలో పింఛన్లు కూడా చెల్లించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు నమ్మకద్రోహం చేశాయి. చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను విస్మరించాయి.’’ -బాబూరావు సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు

రాజధాని అమరావతే

‘‘ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని ఎక్కడికీ తరలిపోదు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కచ్చితంగా అమరావతిలోనే కొనసాగుతుంది’’

పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొంటాం

''రాజధాని రైతుల మహా పాదయాత్రలో ప్రవాసాంధ్రులు ప్రత్యక్షంగా పాల్గొంటారు. అమరావతి ఉద్యమాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. అమెరికాలోని భారత రాయబార అధికారులను త్వరలోనే కలిసి ఏపీ రాజధాని అంశంపై లేఖను అందిస్తాం. అమరావతి నిరసన 200ల రోజుకు చేరినప్పుడు ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. అదే తరహాలో పాదయాత్రలోనూ పాల్గొంటామన్నారు.'' - తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం

వైకాపా మినహా అన్ని పార్టీల మద్దతు

రాజధాని రైతుల మహాపాదయాత్రకు వైకాపా మినహా.. అన్ని రాజకీయ పార్టీలు, రైతు, ప్రజా సంఘాలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించాయి. తెదేపా, భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంల నేతలు, దళిత బహుజన ఫ్రంట్‌, అఖిల భారత కిసాన్‌ సంఘ్‌, ఎస్‌ఎఫ్‌ఐ తదితర రైతు, ప్రజా, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Amaravati Farmers: 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' మహా పాదయాత్ర.. తొలిరోజు సాగిందిలా..

ABOUT THE AUTHOR

...view details