తెలుగుదేశం సీనియర్ నాయకులు, 175 నియోజకవర్గాల తెదేపా అభ్యర్థులు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దుర్మార్గుల పాలనలో మంచివాళ్లకు కలిగే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ దోపిడీకి ఇదే చివరి అవకాశం అన్న ఆరాటంతో వైకాపా బరితెగించిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల సహనానికి హద్దులు దాటిపోయి వైకాపా దుర్మార్గాలపై తిరగబడే పరిస్థితి వచ్చిందన్నారు.
ప్రజల ఆరోగ్యం, పేదల ఉపాధి వైకాపా ప్రభుత్వానికి లెక్కలేదని.. దళిత ఆడబిడ్డల మానానికి, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగేందుకు, మాట్లాడేందుకు హక్కు లేదని..., ప్రాథమిక హక్కులనే కాదు, జీవించే హక్కును కూడా కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర అత్యంత కీలకమైనదని.. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదేనని గుర్తు చేశారు. అలాంటిది ప్రతిపక్షాన్ని అణిచేయాలని పోలీసులు చూడకూడదని హితవు పలికారు. ప్రశ్నించే గొంతును నొక్కేయాలని ప్రయత్నించకూడదని సూచించారు. పార్టీలకు అతీతంగా పోలీసు వ్యవస్థ పనితీరు ఉండాలన్నారు.