ఒక్క ఛాన్స్ ఇచ్చిన నేరానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల ఉసురు పోసుకుంటారా అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఫిర్యాదుదారు కేసును ఉపసంహరించుకున్న తర్వాత కూడా రాజధాని రైతుల చేతులకు సంకెళ్ల వేయడం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని తెలిపారు. గతంలో రైతుల కాళ్లకు బేడీలు వేసిన పార్టీకి పట్టిన గతే వైకాపాకి కూడా పడుతుందన్నారు. రైతులకు బేడీలు వేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టి... ఇలాంటి దుర్మార్గాలు పునరావృతం కాకుండా చూడాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
రైతులకు బేడీలు వేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు మరో అప్రతిష్ట మూటగట్టారని మండిపడ్డారు. కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా అనే చర్చకు దేశవ్యాప్తంగా తెర దీశారని విమర్శించారు. గత 17నెలలుగా రాష్ట్రంలో కన్నీళ్లు పెట్టని రైతు కుటుంబాలు లేవన్న చంద్రబాబు... అన్నదాత కుటుంబాలను ఎందుకింత క్షోభ పెడుతున్నారని నిలదీశారు. మద్దతు ధర అడిగిన అన్నదాతలపై అక్రమ కేసులు, తమ భూములు లాక్కోవద్దని వేడుకున్న రైతులపై తప్పుడు కేసులు, స్వచ్ఛందంగా రాజధానికి భూములిచ్చిన రైతులపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు.