మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పార్టీ కార్యాలయం నుంచి నరసరావుపేట పర్యటనకు చంద్రబాబు కాన్వాయ్‌తో వెళ్తున్న నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు.ఈ చర్యపై చంద్రబాబు మండిపడ్డారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీ చేస్తుంటే అనుమతిస్తున్న మీరు.. తమ పార్టీ కార్యకర్తలను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. దీనిపై పోలీసులు మిన్నకుండిపోయారు.
అధికార పార్టీ నాయకులకు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30ని వర్తింపజేయడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు నిరసన తెలపడాన్ని కఠిన నిర్బంధ చర్యలతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గమ్మకు మొక్కు తీర్చుకోవడానికి పొంగళ్లు తీసుకెళ్తున్న మహిళలపై దౌర్జన్యం చేయడం ప్రజా హక్కులను కాలరాయడం కాదా? అని ప్రశ్నించారు. దీర్ఘ కాలం 144 సెక్షన్ అమలు చేయడం చట్ట విరుద్దమని సుప్రీంకోర్టు చెప్పినా.. అమరావతి పరిధిలో సుదీర్ఘ కాలం అమలు చేయడం దుర్మార్గం కాదా.? అంటూ మండిపడ్డారు. మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేస్తూ.. గాయాలపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు అనుమతులు ఎందుకు నిరాకరిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. చట్టానికి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజా హక్కులను కాపాడేలా డీజీపీ వ్యవహరించాలన్నారు. ఈ మేరకు డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు.