పాలకుల దుర్మార్గం, అణచివేత, అహంకారం, వివక్షత పెచ్చుమీరితే యువత ఎలా పక్కదారి పడుతుందో చెప్పడానికి ప్రసాద్ అనే ఎస్సీ యువకుడే ఓ ఉదాహరణ అని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. కొద్ది రోజుల క్రితం వైకాపా నేత ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు సీతానగరం పోలీస్ స్టేషన్లో ప్రసాద్‌కి శిరోముండనం చేసి అవమానించారని మండిపడ్డారు. ఇంతవరకు అతనికి న్యాయం జరగలేదన్న చంద్రబాబు...ఫలితంగా తాను నక్సలైట్‌గా మారేందుకు అనుమతి ఇవ్వమని రాష్ట్రపతికి లేఖ రాసే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడిలో ఇటువంటి ఆలోచన వచ్చిందంటే...రాష్ట్రంలో వ్యవస్థలు ఎంత ప్రమాదకరంగా దిగజారాయో ప్రజలు ఆలోచించాలని కోరారు
దళితుల పట్ల జగన్ ప్రభుత్వ వివక్ష ధోరణి పరాకాష్టకి చేరిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. బంగారు భవిష్యత్తు ఉన్న దళిత యువకుడు ప్రసాద్... నక్సలిజం వైపు వెళ్ళాలనుకునే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలకు అడ్డుపడ్డాడని శిరోముండనం చేసి చావ గొట్టారని ఆక్షేపించారు. ఘటనకి కారణం అయిన వైకాపా నేతలపై చర్యలు లేకపోగా ప్రసాద్ ని వేధిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.