ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా ఎమ్మెల్సీలు రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు: చంద్రబాబు - chandrababu again congratulate tdp mlcs about their fight in council

3 రాజధానుల బిల్లును శాసనమండలిలో అడ్డుకున్న తెలుగుదేశం ఎమ్మెల్సీల పోరాటాన్ని.. అధినేత చంద్రబాబు మళ్లీ ప్రశంసించారు. ఈ విజయాన్ని గ్రామగ్రామాన నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

chandrababu
chandrababu

By

Published : Jan 23, 2020, 10:21 AM IST

పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకున్న పార్టీ ఎమ్మెల్సీలపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ధర్మాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడారని అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ చేశారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల నిరూపించారని ప్రశంసించారు. యనమల అనుభవం, పరిజ్ఞానంతో ప్రజాస్వామ్యానికి జీవం పోసినట్టయిందని అన్నారు. తెదేపా యువ ఎమ్మెల్సీల ధైర్యం, తెగువ ప్రశంసనీయమని కొనియాడారు. మండలిలో మంత్రులు, వైకాపా ఎమ్మెల్సీల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

''వైకాపా మంత్రులు షరీఫ్‌పై దాడి చేశారు. ముస్లిం సమాజాన్ని అవమానపరిచేలా దుర్భాషలాడారు. అసభ్య పదజాలంతో ఛైర్మన్‌ను బొత్స అవమానించారు. ముగ్గురు మంత్రులు లోకేశ్‌పై దౌర్జన్యం చేశారు. ఉన్మాదం, రాక్షసత్వంతో పోరాడటానికి సర్వశక్తులూ ఒడ్డాల్సిందే. భోజనం లేకున్నా, అనారోగ్యంతో ఉన్నా అన్నింటినీ తట్టుకుని ఎమ్మెల్సీలు నిలబడ్డారు. ఫరూక్, శత్రుచర్ల అనారోగ్యాన్ని కూడా లెక్కచేయలేదు. అసెంబ్లీలో వైకాపా ఏకపక్షంగా వ్యవహరించింది. చర్చకు అవకాశం ఇవ్వకుండా మొండిగా ప్రవర్తించింది. రింగు దాటి వస్తే.. బయట పడేయండని సీఎం జగన్ మార్షల్స్‌ను ఆదేశించారు. మరి అదే వైకాపా మంత్రులు కౌన్సిల్‌లో చేసిందేమిటి? పోడియం బల్లలు ఎక్కి, పేపర్లు చించి సభాపతిపై విసిరిన మంత్రులను, వైకాపా ఎమ్మెల్సీలను ఏం చేయాలి? ప్రజాస్వామ్యాన్ని చెరపట్టాలని వైకాపా చూసింది. తెదేపా ఎమ్మెల్సీలంతా ప్రతిఘటించారు''

- తెదేపా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో పార్టీ అధినేత చంద్రబాబు

తెలుగుదేశం ఎమ్మెల్సీలు మండలిలో ఒకరితో ఒకరు పోటీపడ్డారని... వాళ్లకుండే శక్తినంతా వినియోగించారని చంద్రబాబు అన్నారు. ఇది ప్రజా విజయం, ప్రజాస్వామ్య విజయం.. ప్రజల ఆకాంక్షలు నిలబెట్టే ప్రజాస్వామ్య పోరాటం అంటూ ఎమ్మెల్సీల భుజం తట్టారు. సంఖ్య కాదు ముఖ్యం, స్ఫూర్తి ముఖ్యం అని రుజువు చేశారన్నారు. ఈ విజయాన్ని గ్రామగ్రామానా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ సాక్షిగా నేడు జరిగే ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details