ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబు కేసు: సుప్రీం సీనియర్ న్యాయవాది ఏమన్నారంటే...

రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా, నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

Chandrababu Advocate Siddartha Ludra comments on CID Case
చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

By

Published : Mar 19, 2021, 4:14 PM IST

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంపై సీఐడీ కేసు కొట్టివేయాలంటూ తెలుగుదేశం అధినేత హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. సీఆర్డీఏ చట్టం ద్వారా తీసుకువచ్చిన జీవో చెల్లదనటం సరికాదని, ఐపీసీలోని సెక్షన్‌ 166, 167 ఈ ఫిర్యాదుకు వర్తించవన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే ఈ సెక్షన్ల కింద కేసు పెట్టాలని.. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలకు, పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని లూథ్రా ఉన్నత న్యాయస్థానానికి తెలియజేశారు.

జీఓ విడుదలైన 35 రోజుల తర్వాత దానిని అప్పటి సీఎం ఆమోదించారని.. విచారణ నివేదికలోనే చెబుతున్నారన్నారు. అలాంటప్పుడు సీఎంకు తెలిసి జీఓ ఇచ్చారని ఎలా చెబుతారన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈ ఫిర్యాదులో కేసు నమోదు చేయటం కుదరదని.. ఇక్కడ నష్టపోయిన వ్యక్తులు ఫిర్యాదు చేయలేదని, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రి ఎక్కడా ఈ ప్రక్రియలో పాల్గొనలేదన్నారు. అలాంటప్పుడు ఎస్సీ, ఎస్టీ చట్టం ఎలా వర్తిస్తుందన్నారు.

నారాయణ తరపు వాదనలు..

నారాయణ తరపున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ విజ్ఞప్తి మేరకు జీఓను సవరించారని, జీవోకు సంబంధించిన చర్చలు, విడుదల చేసే ప్రక్రియలో గాని.. అప్పటి సీఎం, మంత్రి పాల్గొనలేదని దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. జీవో విడుదలయ్యాక మాత్రమే ఆమోదానికి పంపారని, వ్యక్తిగతంగా వెళ్లి.. వారిని నష్టపరిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లు వర్తిస్తాయని దమ్మాలపాటి అన్నారు. జీవో ద్వారా లబ్దిదారులకు ప్రయోజనం కల్పిస్తే కేసు ఎలా పెడతారని దమ్మాలపాటి ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల కోసం భూములు తీసుకొనే సమయంలో.. అప్పటి ప్రభుత్వం అన్నివర్గాలకు లబ్ది చేకూర్చిందన్నారు. దాని ప్రకారమే భూములు సమీకరించారన్నారు.

ఇదీ చదవండి:మోకా భాస్కరరావు హత్యకేసులో ప్రధాన నిందితుడు జిల్లా బహిష్కరణ

ABOUT THE AUTHOR

...view details