జగన్ పాలనలో ఏపీలో ఎక్కడ చూసినా అరాచకం, విధ్వంసమే రాజ్యమేలుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెంచేశారని.. చివరికి చెత్తపైనా పన్నులు వేస్తున్నారని విమర్శించారు. ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో అమెరికాలోని బోస్టన్‌లో శనివారం ప్రారంభమైన మహానాడును ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా స్వాగతోపన్యాసం చేశారు. ఎన్నారై తెదేపా కన్వీనర్ కోమటి జయరాం చంద్రబాబుకు స్వాగతం పలికారు. ‘ఇటీవల ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటన సందర్భంగా ప్రజలు వైకాపా నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్న విషయం గుర్తించాను. మాజీమంత్రి వివేకా హత్యపై జగన్ చాలా మాటలు మార్చారు. ఎన్నికల ముందువరకు చెల్లెల్ని ఉపయోగించుకొని తర్వాత ఈ కేసులో మాట్లాడటానికి వీల్లేదని చెప్పారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
జగన్ అడుగుపెట్టిన చోటల్లా నాశనమే :‘జగన్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమే. అమరావతిని సర్వనాశనం చేశారు. అమరావతి ఉంటే ఇప్పుడు రూ.2-3 లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి సమకూరేది. పోలవరం ప్రాజెక్టును సందిగ్ధంలో పడేశారు. విద్యుత్తు కోతలతో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. సమస్యలు ఇలాగే పెరిగితే రాష్ట్రంలో భయంకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. ఏపీ నుంచి రాజ్యసభ స్థానాలకు ఆర్.కృష్ణయ్య లాంటివారిని, తనతోపాటు కేసుల్లో ఉన్నవారిని జగన్ ఎంపికచేశారు. ఎక్కడో పదోతరగతి తెలుగు పేపర్ లీకైందని మాజీ మంత్రి నారాయణను కస్టడీలోకి తీసుకున్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు’ అని చంద్రబాబు తెలిపారు.
ఏపీని మరో శ్రీలంక కాకుండా కాపాడాలి :ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రవాసాంధ్రులపై ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రూ.8 లక్షలకోట్ల అప్పు చేసింది. రాష్ట్రాన్ని కాపాడటానికి మీరంతా కృషి చేయాలి. 2500 మందితో అమెరికాలోని బోస్టన్‌లో మహానాడు నిర్వహించడం తెలుగువారి సత్తాకు నిదర్శనం’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.