తెలుగు ప్రజలను ఏకం చేయటంతోపాటు శక్తిమంత రాష్ట్ర నిర్మాణానికి చేపట్టిన ప్రాజెక్టే అమరావతి అని చంద్రబాబు అన్నారు. రైతుల పోరాటం 200వ రోజుకు చేరిన సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొనాలని తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాడుతున్న రైతుల అకుంఠిత స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. రాష్ట్రాభివృద్ధికి భూములు త్యాగం చేసిన రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందన్నారు. అమరావతి నిర్మాణం నిలిపివేత జాతీయ విషాదమని ప్రముఖ పాత్రికేయులు అన్నది నిజమైందని ఆగ్రహించారు. ఓ అద్భుత రాజధానిని నిర్మించుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం దూరం చేసిందన్నారు. 200 రోజులుగా రైతులు, మహిళలను వేధించి జగన్ ఏం సాధించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిలదీశారు.
రైతుల అకుంఠిత స్ఫూర్తికి సెల్యూట్: చంద్రబాబు
విభజన బాధల్లో నుంచి అమరావతి ఆలోచన పుట్టిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. తెలుగు ప్రజలను ఏకం చేయడంతోపాటు శక్తిమంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి చేపట్టిన ప్రాజెక్టే అమరావతి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించే వరకు భూములిచ్చిన రైతులతో కలిసి తెలుగుదేశం పోరాడుతుందని తేల్చిచెప్పారు.
chandrababu about amaravathi farmers protest 200 days