అధికారం ఉంది కదా అని వైకాపా అహంకారంతో వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అహంభావంతో వారు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. సభాపతి ప్రవర్తన, పద్ధతి సరిగా లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడారు. మైక్ ఇమ్మని కోరితే తమకు ఇవ్వకుండా.. అధికార పక్షంలో 10 మందికి అవకాశం ఇచ్చారని ఆరోపించారు. సభలో ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉంటే మైక్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న అసెంబ్లీలో తాము దీటుగా సమాధానం చెప్పటంతో ఇవాళ ఏకపక్షంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. వాళ్లకు అనుకూలంగా మాట్లాడుతూ... తమ వాదన చెప్పే అవకాశం ఇవ్వట్లేదని మండిపడ్డారు. స్పీకర్ నిగ్రహంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. మైక్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవడమేంటని ప్రశ్నించారు. మీడియాపైనా ఆంక్షలు విధిస్తున్నారని... ఈ అంశంపై రేపు సచివాలయం ఫైర్‌స్టేషన్ వద్ద నిరసన తెలపనున్నట్టు చంద్రబాబు తెలిపారు. దీనిపై గవర్నర్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.
వంశీకి ప్రత్యేక స్థానం ఏంటి?
శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి సభాపతి ప్రత్యేక స్థానం కల్పించటాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తికి ప్రత్యేక స్థానం ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. వంశీపై పూర్తి బహిష్కరణ వేటు పడితే తప్ప అతను ప్రత్యేక సభ్యుడు కాదని అన్నారు.