వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వరుస హత్యలు, అత్యాచారాలు, హింసాత్మక దాడులు, బెదిరింపులు, వేధింపులు ఎక్కువ అయ్యాయంటూ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కొందరు పోలీసులు అధికార వైకాపా నాయకులతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల ప్రాణాలకు, జీవనోపాధికి, ఆస్తులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఎన్నికైన వైకాపా ప్రజాప్రతినిధులే ఈ దాడులకు నాయకత్వం వహించడంతో.. ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారని లేఖలో పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులే దాడులకు నాయకులు:
డిసెంబర్ 24న తాడిపర్తి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. కత్తులు, గొడ్డళ్లు, మారణాయుధాలతో తన అనుచరులను వెంటేసుకుని తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడిచేశారని చంద్రబాబు తెలిపారు. ఆయన ఇంట్లో లేకుండా చూసి పట్టపగలే దాడికి పాల్పడ్డారని వివరించారు. పెద్దారెడ్డే స్వయంగా దాడికి నాయకత్వం వహించి.. ప్రభాకర్ రెడ్డి అనుచరుడిని తీవ్రంగా గాయపరిచారన్నారు. అధికార పార్టీకి చెందిన ఎన్నికైన ప్రజాప్రతినిధే బరితెగించి హింసాత్మక దాడులకు తెగబడటం చూస్తుంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులెలా ఉన్నాయో ఊహించుకోవచ్చన్నారు. యూనిఫాంలో ఉన్న పోలీసులు.. ఈ దాడిని ఆపకుండా సహకరించడం, ప్రోత్సహించడం జరిగిందని లేఖలో స్పష్టం చేశారు. సీసీ టీవీ ఫుటేజి సాక్ష్యంగా ఉన్నా ఆందోళనకారులపై కేసులు పెట్టడానికి బదులు.. బాధితులపైనే కేసులు నమోదుచేయడానికి పోలీసులు శ్రద్ద చూపారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వమే వేధిస్తోంది అనడానికి ఈ సంఘటనలే నిదర్శనమన్నారు.