రాష్ట్రంలో వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల ముందే వైకాపా నేతలు అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆడబిడ్డలకు రక్షణ ఏదీ..?
పుంగనూరులో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళను అడ్డుకున్న తీరును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. బురఖా వేసుకుని వెళ్లినా.. వైకాపా నేతలు లోపలికి రానివ్వడం లేదని అన్నారు. అదే ఊరిలో మరో మహిళపై దాడి చేసిన దృశ్యాలను మీడియా ముందు ఉంచారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైందని... వైకాపా నేతలపై దిశ చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. వీరిని ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌పైనా దిశ కేసు పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా... సీఎం, హోంమంత్రి, డీజీపీ, ఎన్నికల సంఘం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
నేరాలను క్రమబద్ధీకరించారు
రాష్ట్రంలో వైకాపా ఆగడాలు శ్రుతి మించిపోయాయని చంద్రబాబు దుయ్యబట్టారు. తమ ప్రభుత్వ హయాంలో తప్పు చేయడానికి భయపడేవారంతా ఇప్పడు రెచ్చిపోయి నేరాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్... నేరసంస్కృతిని అధికారికంగా మార్చేశారని నిప్పులు చెరిగారు.
అడుగడుగునా వేధింపులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే తెదేపా నేతలను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో పతనం తప్పదని... ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. పోలీసుల తీరునూ ఆయన తప్పుబట్టారు. తప్పు చేసిన వైకాపా నేతలను వెనుకేసుకొస్తూ... వాటిని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భయపెట్టి బెదిరించి... దొడ్డిదారిన ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. పోలీసులనూ వాడుకుంటున్నారని ఇది భవిష్యత్‌లో వారికి తలవంపులు తీసుకొస్తుందన్నారు. మద్యం బాటిళ్లను తెలుగుదేశం నేతల ఇళ్లల్లో దొంగచాటున దాచి పెట్టి... కేసులు పెడుతున్నారని... ఇలాంటి దుశ్చర్యల కోసమే దొంగ జీవోలు తీసుకొచ్చారని విమర్శించారు. వైకాపా నేతలు మాత్రం తెలంగాణ నుంచి మద్యం ఇష్టారాజ్యంగా తీసుకొస్తున్నారని ఆరోపించారు.