భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమవుతుంటే... ప్రభుత్వం సహాయ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తినష్టం ఏవీ లెక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల తెలుగుదేశం నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి భరోసా కల్పించాలన్నారు.
అమరావతి మునిగిందని దుష్ప్రచారం చేశారని చంద్రబాబు ఆరోపించారు. జల నిర్వహణలో విఫలమయ్యారని.. నీటిని సకాలంలో సరైన మోతాదులో విడుదల చేయలేదని దుయ్యబట్టారు. ఏడాదిన్నరగా వరుస విపత్తుల్లో ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సాయం అందజేయలేదన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రియల్‌టైం గవర్నెన్స్ ద్వారా తుపాను తీరందాటే సమయాన్ని, తాకే సమయాన్ని ముందుగానే అంచనా వేసి ప్రాణ, ఆస్తి నష్టం నివారించామని చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వంలో ఆ చొరవ, స్ఫూర్తి రెండూ లేవని విమర్శించారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని... పెద్ద ఎత్తున రహదారులు దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.