ఆంధ్రప్రదేశ్‌లో కంటే పొరుగు రాష్ట్రాల్లో పెట్రోలు ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినా రాష్ట్రంలో ఎందుకు తగ్గించలేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. శనివారం తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వస్తే అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ధరకే పెట్రోలు, డీజిలు అందజేస్తామని అప్పట్లో జగన్ చెప్పారని.. దానికి కట్టుబడి లీటరుకు రూ.16-17 తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గించే వరకు తెదేపా పోరాడుతుందన్నారు. వచ్చే మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు రాష్ట్రంలోని అన్ని పెట్రోలు బంకుల దగ్గరా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని ఆయన ప్రకటించారు. మన రాష్ట్రానికి, మిగతా రాష్ట్రాలకు మధ్య పెట్రోలు, డీజిలు ధరల్లో ఎంత వ్యత్యాసం ఎంత ఉందో, కేంద్రం ధరలు తగ్గించాక, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ మేరకు ధరలు తగ్గించాయో ఆయన పట్టికల ద్వారా వివరించారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలోనూ, శాసనసభలోనూ జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోల్ని ప్రదర్శించారు.
‘కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించిన తర్వాత అసోం, గోవా, త్రిపుర, మణిపూర్, సిక్కిం వంటి చిన్న రాష్ట్రాలు కూడా ధరలు తగ్గించాయి. మరి జగన్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు తగ్గించదు? ఇది చెత్త పరిపాలన కాకపోతే మరేంటి? పెట్రోలు, డీజిలు ధరలు పెరగడం వల్ల ప్రతి వస్తువు ఉత్పత్తి వ్యయమూ పెరిగింది. పెట్టుబడి వ్యయం పెరిగిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘విశాఖ నుంచి చెన్నై తీసుకెళుతున్న 50 కిలోల గంజాయిని కాజ టోల్‌గేట్ దగ్గర పట్టుకున్నారు. పోలీసుల్ని పంపించి తెదేపా కార్యాలయంపై దాడులు చేయించిన, మా వాళ్లను వేధించిన డీజీపీ దీనికి ఏం సమాధానం చెబుతారు? ఏజెన్సీ అంతా గంజాయి సాగవుతోంది. యంత్రాలు పట్టుకెళ్లి మరీ దాన్ని తొలగిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఆ గంజాయి మొత్తం బయటకు వస్తే రాష్ట్రం ఏమైపోతుంది? మీకు బాధ్యత లేదా డీజీపీ? గంజాయిపై మేం మాట్లాడే వరకు ఎక్కడ నిద్రపోయారు?’ అని ధ్వజమెత్తారు. ‘అమరావతి రైతులు 700 రోజులుగా నిరసన దీక్షలు చేస్తుంటే.. పోలీసులతో వారిపై దాడులు చేయించారు. అయినా వారు దృఢ సంకల్పంతో పోరాటం కొనసాగిస్తున్నారు. రైతుల పాదయాత్రకు రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతోంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
అప్పట్లో జగన్ ఏమన్నారు?
మీ అందరికీ బైకులు ఉన్నాయా అన్నా.. ఆ బైకుల్లో పెట్రోలు పోయించుకోవడానికి పొరుగునే ఉన్న తమిళనాడు బోర్డర్‌కు పోతే కనీసం లీటరు రూ.7 తక్కువకు పోస్తున్నారు. కర్ణాటక బోర్డర్‌కి పోతే లీటరు పెట్రోలు, డీజిలు కనీసం రూ.6కి తక్కువకి పోస్తున్నారా లేదా? మన రాష్ట్రంలో పెట్రోలు, డీజిలు రేట్లు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు. బాదుడే బాదుడు’