పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ముఖ్యమంత్రి జగన్‌కు ఇష్టం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా నేతలు రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని, తప్పుడు కేసులతో బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకాపా నాయకులు బెదిరింపులకు తలొగ్గకుండా ధైర్యంగా నామినేషన్లు వేస్తున్నవారిని చంద్రబాబు అభినందించారు.
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని తెదేపా చూస్తుంటే.. ధ్వంసం చేయాలని వైకాపా చూస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను మోసగించడం, రాష్ట్రాన్ని దగా చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు తేవడంలో విఫలమైన సీఎం.. కేసుల మాఫీ కోసం వైకాపా ఎంపీలను తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు.