వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారితో తెదేపా అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ విపత్కర పరిస్థితుల్లో విజ్ఞానం, సాంకేతికత రెండూ అనుసంధానం కావాలని చంద్రబాబు అన్నారు. టచ్ పాయింట్లు తగ్గిస్తేనే కరోనా కట్టడి సాధ్యమన్న ఆయన... లాక్డౌన్ వల్ల కరోనా పాజిటివ్ కేసుల వ్యాప్తి తగ్గినా, మళ్లీ నిదానంగా పెరుగుతున్నాయన్నారు. భారత్లో కేసుల సంఖ్య రెట్టింపు... గతంతో పోలిస్తే కాస్త నెమ్మదిగా ఉందని చెప్పారు. కేరళ కరోనాను సమర్థంగా ఎదుర్కొందని.. ఆ రాష్ట్రంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించడమే దానికి కారణమన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా శ్రేయస్సు కోసం తమ వంతు చర్యలు చేపట్టడమని తెలిపారు.
'సాయం చేసేందుకు ముందుకు రండి'
కరోనాపై అధ్యయనానికి ఉత్తమ విధానాలను ప్రోత్సహించాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టచ్ పాయింట్లు తగ్గించేందుకు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు చేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ ద్వారా డోర్ డెలివరీ విధానాలు పెరగాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా తమ ఆలోచనలు పంచుకోవాలని.. రాష్ట్రం కోసం తోచిన సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైద్యులూ కరోనా బారిన పడుతున్నారన్న ఆయన.. ప్రతిఒక్కరూ తప్పక జాగ్రత్తలు పాటించాలన్నారు.