Funds To AP Under Jal Jeevan Mission: జల జీవన మిషన్ అమలు విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా.. 4 వేల కోట్లు కోల్పోయే ప్రమాదం ఉందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్ పేర్కొన్నారు. ఇంటింటికి కుళాయి నీరు అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తి నిధులతో అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ ప్రాజెక్టుకు అవసరమైన రాష్ట్ర వాటాను ఏపీ ప్రభుత్వం గత రెండేళ్లుగా సమకూర్చలేదని రాజ్యసభకు కేంద్ర మంత్రి తెలిపారు. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఈ పథకం కింద కేంద్రం కేటాయించిన నిధుల నుంచి ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని పేర్కొన్నారు.
Funds To AP Under Jal Jeevan Mission: 2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం.. రాష్ట్రానికి రూ. 372.64 కోట్లు కేటాయించి విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 121.62 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 790.48 కోట్లు కేటాయించగా.. వాటిలో కేవలం రూ. 297.62 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదని, 2021-22 ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా రూ. 3180 2.88 కోట్లు కేటాయించగా.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేకపోయిందని వివరించారు. 2019-20, 2020-21 సంవత్సరానికి గాను కేంద్రం తన వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 453.66 కోట్ల రూపాయలను ఇంతవరకు ఇవ్వలేదని వివరించారు. 2022 మార్చిలోపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధుల విడుదలలో జాప్యం చేస్తే... నిబంధనల ప్రకారం రాష్ట్రానికి జల జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం కేటాయించిన 3,183 కోట్ల రూపాయలు మురిగిపోతాయని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు.
MP GVL On Jal Jeevan Mission funds: ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం - ఎంపీ జీవీఎల్
ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రంగాల్లోనూ వేల కోట్ల నిధులను అనేక పథకాల ద్వారా కేంద్రం చేస్తున్న సహాయాన్ని కూడా అంగీకరించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎంపీ జీవీఎల్ అన్నారు. చేతగానితనానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని జీవీఎల్ దుయ్యబట్టారు.