సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసిన వారిపై ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్లు ప్రయోగించడం, కేసులు పెట్టడం అధికార దుర్వినియోగమేనని కేంద్ర మాజీ సమాచార కమిషనర్, ప్రముఖ న్యాయశాస్త్ర ఆచార్యులు డాక్టర్ మాడభూషి శ్రీధర్ అభిప్రాయపడ్డారు. కులమతాల ప్రాతిపదికన ప్రజల్లో ద్వేషభావాలు రెచ్చగొట్టినా, విభేదాలు, విద్వేషాలు సృష్టించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టినా, ప్రచారం చేసినా చట్టప్రకారం శిక్షార్హమన్నారు. ఆ పోస్టుల వల్ల విద్వేషాలు చెలరేగి తక్షణం హింసాకాండకు దారితీసే పరిస్థితులు ఉన్నప్పుడే వారిపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో అశ్లీల ప్రచారం చేసినా ఐపీసీ, ఐటీ సెక్షన్ల ప్రకారం చర్యలు చేపట్టవచ్చన్నారు. కేవలం ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించినవారిని, విమర్శించినవారిని హింసించడానికి ఆ సెక్షన్లను దుర్వినియోగం చేయడం దారుణమని మాడభూషి అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శలు చేశారంటూ కేసులు పెడుతున్న తీరుపై ఆయన మాట్లాడారు.
- చట్టం తెలుసుకుని కేసులు పెట్టాలి
‘ప్రభుత్వాలు వ్యంగ్యాన్ని, విమర్శను ద్వేష రచనగా పరిగణిస్తున్నాయి. గుంటూరుకు చెందిన రంగనాయకమ్మపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ పోలీసులిచ్చిన నోటీసులు చూస్తే.. ప్రభుత్వాన్ని విమర్శించినందుకే కేసు పెట్టినట్టుగా ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించినందుకే అలాంటి సెక్షన్లు పెడితే అది తీవ్ర నేరమే అవుతుంది. ఆ కేసు కోర్టులో నిలబడదు.
భారత రాజ్యాంగం.. ప్రతి పౌరుడికీ భావప్రకటన స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా కల్పించింది. విమర్శను విద్వేష భావనగా చూపించి ఆ హక్కుకు భంగం కలిగించే అధికారం ప్రభుత్వానికి లేదు. విమర్శలో వాస్తవం లేదనుకుంటే నిజమేంటో ప్రభుత్వం చెప్పాలి. పోలీసులు ఏ సెక్షన్లను ఏ సందర్భాల్లో ప్రయోగించాలో తెలుసుకోవాలి. చట్టం తెలిసినవారు, అడ్వొకేట్ జనరల్, ప్రభుత్వ న్యాయవాదులు పోలీసులకు మార్గదర్శనం చేయాలి. అదేమీ చూసుకోకుండా అసందర్భమైన సెక్షన్లు ప్రయోగించడం, అరెస్ట్ చేయడం.. ప్రజల వాక్, వ్యక్తి స్వాతంత్య్రాలను హరించడమే. ప్రచురణ, ముద్రణతో పాటు, హరికథ, బుర్రకథ వంటి ఇతర మాధ్యమాల ద్వారానూ పౌరులు భావాల్ని అభివ్యక్తీకరించే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. అది సామాజిక మాధ్యమాలకూ వర్తిస్తుంది.
- పీసీబీ చేసింది తప్పు