Centre on special status for AP: ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్లో కేంద్ర మరోసారి స్పష్టతనిచ్చింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయినందునే..ఏపీకి ప్రత్యేక సాయం చేయడానికి అంగీకారం తెలిపినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మిగిలిన వాటికి కొంత సమయం ఉందని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.
Centre on AP Reorganisation Act promises: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై లోక్సభలో తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను చాలా వరకు అమలు చేసినట్లు పేర్కొన్నారు. మౌలిక వసతులు, విద్యాసంస్థల ఏర్పాటు వంటి వాటికి దీర్ఘకాల సమయం ఉందన్నారు. విభజన అంశాల పూర్తి కోసం చట్టంలోనే పదేళ్ల గడువు ఉందని వివరించారు. చట్టంలో పేర్కొన్న అన్ని పూర్తి చేసేందుకు కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు.. ఏపీ, తెలంగాణ ప్రతినిధులతో సమీక్ష చేస్తోందని వెల్లడించారు.