కృష్ణా, గోదావరి బోర్డులకు ఇప్పటివరకు పరిధి, ప్రాజెక్టులపై అజమాయిషీ లేకపోవడంతో అవి సమర్థంగా పనిచేయడమనేది సవాల్‌గా మారిందని కేంద్ర జలసంఘం, ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రెయినేజి, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చి పేర్కొన్నాయి. ‘‘పార్లమెంటులో చట్టం ద్వారా ఏర్పాటైనప్పటికీ కృష్ణా, గోదావరి బోర్డులు విజయవంతం కాలేకపోయాయి. వీటితో పోల్చితే ఇదే తరహాలో అంతకు ముందే ఏర్పాటైన తుంగభద్ర బోర్డు, భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు విజయవంతమయ్యాయి. బ్రహ్మపుత్ర బోర్డు కొంతమేరకు సఫలీకృతమైంది’’ అని వివరించాయి.
కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పనితీరుపై కేంద్ర జలసంఘం ముసాయిదా - Central Water Board Draft on Performance of Krishna and Godavari River Boards
దేశంలో ఉన్న 11 నదీ యాజమాన్య బోర్డుల పనితీరు, ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర జలసంఘం, ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రెయినేజి, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చి సంస్థలు విస్తృతంగా చర్చించి ముసాయిదా నివేదికను రూపొందించాయి. కృష్ణా, గోదావరి బోర్డులకు ఇప్పటివరకు పరిధి, ప్రాజెక్టులపై అజమాయిషీ లేనందున అవి సమర్థంగా పనిచేయడమనేది సవాల్‌గా మారిందని పేర్కొన్నాయి.
కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పనితీరుపై కేంద్ర జలసంఘం ముసాయిదా
దేశంలో ఉన్న 11 నదీ యాజమాన్య బోర్డుల పనితీరు, ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ మూడు సంస్థలు విస్తృతంగా చర్చించి ముసాయిదా నివేదికను రూపొందించాయి. దీనిపై అన్ని నదీ యాజమాన్య బోర్డులు, రాష్ట్రాల జలవనరుల శాఖల అభిప్రాయాలు తీసుకొన్న తర్వాత తుది నివేదికను కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు అందజేయనున్నాయి. మొత్తం 16 అంశాలతో నివేదికను తయారు చేశాయి. ఈ అంశాలన్నింటినీ కేంద్రం తీసుకురానున్న రివర్ బేసిన్ మేనేజ్‌మెంట్ బిల్లులో చేర్చాలని సూచించాయి.
ముసాయిదాలో ప్రస్తావించిన ముఖ్యాంశాలు ఇలా...
- పంజాబ్ పునర్విభజన చట్టం 1966 ప్రకారం ఏర్పాటైన భాక్రాబియాస్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అధికారాలతో పూర్తిస్థాయి ఛైర్మన్‌ను నియమించారు. రాష్ట్రాల సహకారంతో ఈ బోర్డు బాగా పని చేస్తోంది. కఠిన నిర్ణయాలు కూడా తీసుకోగలిగింది.
- గోదావరి, కృష్ణా, బ్రహ్మపుత్ర బోర్డులకు అధికారాలు లేకపోవడం, నైపుణ్యం, తటస్థత తదితర సమస్యలు బోర్డుల నిర్వహణపై ప్రభావం చూపుతున్నాయి. చట్టపరమైన అధికారాలు కల్పించడం, రాజకీయ పార్టీలు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చించడం ద్వారా బోర్డులు మరింత మెరుగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది.
- 2019లో పంజాబ్‌లో వరదలను నివారించడానికి వచ్చిన నీటిలో ఎక్కువ భాగం అంతర్జాతీయ సరిహద్దు ద్వారా పాకిస్థాన్‌లోకి వదిలిపెట్టాల్సి రావడంతో భాక్రాబియాస్ బోర్డు విమర్శలను ఎదుర్కొంది. దీనికి కారణం రాజకీయ పార్టీలు, ప్రజలకు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడమే. 2020లో భాగస్వాములతో చర్చించి విడుదల చేయడం వల్ల అంతా సవ్యంగా జరిగింది. వరదను నివారించడానికి నీటిని వదిలిపెట్టడం తప్పనిసరి. అయితే ఈ నీటి భాగస్వాముల్లో విశ్వాసం కలిగించడం వల్ల ఫలితం ఉంటుంది.
- ప్రాజెక్టులు బోర్డు ఆధీనంలో ఉండటం వల్ల వాటి సామర్థ్యం పెరుగుతుంది. రాష్ట్రాల మధ్య వివాదాలు తక్కువగా ఉంటాయి. తుంగభద్ర బోర్డే దీనికి మంచి ఉదాహరణ. వరద అంచనా, నీటి వినియోగానికి సంబంధించిన సమాచారం అన్నింటిలో పారదర్శకత చాలా ముఖ్యం. తుంగభద్ర బోర్డు టెలిమెట్రీ వ్యవస్థను కూడా చాలా పటిష్ఠంగా వినియోగించుకొంటుంది. ఇది సమర్థంగా పనిచేయడానికి సమాచారం అంతా పారదర్శకంగా ఉండటం కూడా కారణం.
- కృష్ణా, గోదావరి బోర్డులు దీనికి భిన్నం. వీటి పరిధి ఏంటో స్పష్టంగా చెప్పకపోగా, తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాలని పేర్కొంది. అయితే అనేక అంశాలపై రాష్ట్రాల అంగీకారం లేకపోవడంతో పాటు ఇప్పటివరకు పరిధి లేకపోవడం వల్ల రెండు బోర్డుల నిర్వహణలో అనిశ్చితి ఏర్పడింది. కొత్త ప్రాజెక్టులు అంటే ఏమిటనేదానిపైన కూడా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య అంగీకారం లేదు. దీంతో పాటు అనేక అంశాలు బోర్డుల నిర్వహణలో సవాల్‌గా మారాయి. బోర్డుల పరిధి బేసిన్ మొత్తం లేకపోవడం వల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. గోదావరి, కృష్ణా బోర్డులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఉన్న అంతర్ రాష్ట్ర సమస్యల వరకే పరిమితం. కానీ బేసిన్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందాలు అమలు జరగకపోయినా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏమీ చేయలేదు. ఆర్థికంగా కూడా బోర్డులకు స్వయం ప్రతిపత్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలన్నింటినీ రివర్ బేసిన్ మేనేజ్‌మెంట్ బిల్లులో చేర్చాలి.