‘‘తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. అది భాజపా ద్వారానే సాధ్యమన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది. దుబ్బాక ఉపఎన్నికతో తొలి అడుగు పడింది.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రెండో అడుగేసేందుకు జనం సిద్ధమవుతున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి కేంద్రంపై యుద్ధం అంటూ తెరాస చౌకబారు ప్రకటనలు చేయడం సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధం..’’ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ ప్రజలు ఈసారి అవకాశం ఇస్తే భాజపా అసలైన అభివృద్ధి చేసి చూపిస్తుందని ‘ఈనాడు-ఈటీవీభారత్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
- గ్రేటర్ ఎన్నికల్లో భాజపా లక్ష్యం ఏంటి?
హైదరాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకోవడమే మా లక్ష్యం. కనీసం 90 సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాం.
- స్థానిక ఎన్నికలకు జాతీయ స్థాయిలో కీలకనేత భూపేంద్ర యాదవ్ సహా ఐదుగురు ఇంఛార్జీలను రంగంలోకి దింపడానికి ప్రత్యేక కారణాలున్నాయా?
స్థానిక సమరమే అయినప్పటికీ.. రాష్ట్ర రాజధాని ప్రాంతం.. నాలుగు జిల్లాల పరిధి.. 5 లోక్‌సభ స్థానాలు, 24 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 74 లక్షలమంది ఓటర్లు పాల్గొనే కీలక ఎన్నిక ఇది.. ఈ కారణాలతోనే గ్రేటర్ ఎన్నికలకు జాతీయ నాయకత్వం ప్రాధాన్యమిస్తోంది. నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని అయ్యాక తెలంగాణలో యువతతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచీ భాజపాకు మద్దతు పెరుగుతోంది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోనూ భాజపా జెండా ఎగరేయాలన్నది మా లక్ష్యం.
- కర్ణాటక, గుజరాత్‌కు పెద్దఎత్తున వరదసాయం అందిందని.. హైదరాబాద్‌కు పైసా అందలేదన్న విమర్శలపై ఏమంటారు?
తెలంగాణలో పంటనష్టంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదిక ఇవ్వలేదు. కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో వరదలతో నష్టపోయినవారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప స్వయంగా కలిసి నష్టపరిహారమిచ్చారు. ఇక్కడ సీఎం కేసీఆర్ వరద బాధితుల్ని పరామర్శించారా? వరద సాయాన్ని గులాబీ దండు తన్నుకుపోయింది.
- హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా ఉందని గతంలో మీరు అన్నారు కదా? ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని చాలావరకు తగ్గించగలిగాం. టెక్నాలజీ వాడుకుంటున్నాం. ఉగ్రవాద సంస్థలకు విదేశాల నుంచి నిధులు అందకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఫలితంగా హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఉగ్రవాదం తగ్గుముఖం పడుతోంది.
- గ్రేటర్ ఎన్నికల్లో భాజపాకే ఎందుకు ఓటేయాలో చెబుతారా..
హైదరాబాద్‌లో కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాలే రాజ్యమేలుతున్నాయి. ఈ రెండింటి ఆధిపత్యం అంతం కావాలంటే భాజపాకు ఓటేయాలని ప్రజల్ని కోరుతున్నా.
- మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదని.. దేశ రాజకీయాల్లో తెరాస కీలకపాత్ర పోషించబోతుందని సీఎం కేసీఆర్ చెబుతున్నారు కదా?
కేసీఆర్ కేంద్రంపై యుద్ధం చేస్తానంటున్నరు.. ఆ వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారా? తెరాస అధినేతగానా? అన్నది స్పష్టంచేయాలి. యుద్ధం పాకిస్థాన్‌తో చేస్తారు.. సరిహద్దుల్లో ఇతర దేశాలతో యద్ధం అవుతుంది, దేశం లోపల జరగదు.. తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాజ్యాంగానికి లోబడి వ్యవహరిస్తే మంచిది. కేంద్రంపై యుద్ధం చేయడమేంటో వివరిస్తే బాగుంటది.
- ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ద్వారా పార్టీ బలోపేతం సాధ్యమని భాజపా భావిస్తోందా..
మా తొలి ప్రాధాన్యం యువతే. ఆ తర్వాతే ఇతర పార్టీల్లోని మంచి నేతలపై దృష్టిపెడుతున్నాం. భాజపాలో చేరుతున్నవారిలో 90 శాతం మంది యువతే. యువశక్తే దుబ్బాకలో భాజపాను గెలిపించింది.
- రాజకీయలబ్ధికి భాజపా మతాన్ని రాజకీయం చేస్తుందన్న విమర్శలపై ఏమంటారు?