డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా ఒక గొప్ప మార్పు తెస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ధీమా వ్యక్తం చేశారు. విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ఆయన అన్నారు. డిజిటల్ ఎయిర్ స్పేస్ మ్యాప్ ద్వారా అనుమతులు సులభతరం చేశామని చెప్పారు. తెలంగాణలోని వికారాబాద్‌లో "మెడిసిన్ ఫ్రమ్ ది స్కై(medicine from the sky)" ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎయిర్ స్పేస్‌ను మూడు భాగాలుగా విభజించి అనుమతులు ఇస్తున్నామని సింధియా అన్నారు. తద్వారా డ్రోన్లకు అనుమతులు, నిర్వహణను సులభతరం చేశామని వెల్లడించారు. విమానాశ్రయం విస్తరించాలనే తెలంగాణ ప్రభుత్వ కోరిక మేరకు.. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించామని చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్‌లో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి సుముఖంగా ఉన్నామని వెల్లడించారు.