అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు సంబంధించిన సీనియర్ అధికారులు, ఉక్కుశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఉక్కుశాఖ కార్యదర్శి బినోయ్‌రాయ్, పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి అమర్‌నాథ్, ఎన్‌ఎండీసీ సీఎండీ ఎన్.బైజేంద్రకుమార్, గెయిల్ సీఎండీ అశుతోష్ కర్ణాటక్, ఓఎన్జీసీ సీఎండీ శశిశంకర్, హెచ్‌పీసీఎల్ సీఎండీ ముఖేష్ కుమార్ సురానా, ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ పి.కె.రథ్ పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, దృష్టి పెట్టాల్సిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు వివరించారు.
త్వరలో ఎంవోయూ..
పునర్వివిభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనికోసం ప్రపంచంలోని ప్రఖ్యాత ఉక్కు కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని కేంద్ర మంత్రికి సీఎం జగన్ వివరించారు. ప్లాంట్ నిర్వహణలో స్థిరత్వం సాధించడానికి నిరంతరాయంగా ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయాలని కోరారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం ఎన్‌ఎండీసీ ఒప్పందం చేసుకుంటుందని వెల్లడించారు. త్వరలోనే దీనిపై ఎంఓయూ కుదుర్చుకోవాలని కేంద్ర ఉక్కుశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
సీఎస్ఆర్కు సానుకూలమే
తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం బైరవపాలెంలో జీఎస్‌పీసీ లిమిటెడ్ నిర్వహించిన ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ వల్ల 16,554 మత్స్యకార కుటుంబాలకు చెల్లించాల్సిన 81 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరు చేయాలని కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ పరిహారం చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి ప్రదాన్ ఓఎన్జీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చమురు, గ్యాస్ కంపెనీలు ఏపీలో తమ టర్నోవర్‌కు తగినట్టుగా సీఎస్‌ఆర్ నిధులు ఇవ్వాలంటూ చేసిన విజ్ఞప్తిపైనా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ఆయా కంపెనీల టర్నోవర్ మేరకే సీఎస్‌ఆర్ వచ్చేలా చూస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. చమురు, గ్యాస్ వెలికి తీస్తున్న కంపెనీలు చెల్లిస్తున్న రాయల్టీలో రాష్ట్రానికి వాటా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.