పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.11,600.16 కోట్లు చెల్లించామని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. 2019 మే నెల తర్వాత రూ.4,836 కోట్లు విడుదల చేసినట్లు సోమవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్(TDP Rajya sabha member kanakamedala Ravindrakumar) అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2019-20కి సంబంధించి 2020 ఫిబ్రవరిలో రూ.1,850 కోట్లు, 2020-21లో రూ.2,234.20 కోట్లు, 2021-22లో ఇప్పటివరకు రూ.751.80 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. 2019-20, 2020-21కి సంబంధించిన లావాదేవీలపై దిల్లీకి చెందిన ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఆడిట్ (వ్యవసాయం, ఆహారం, జలవనరులు) చెన్నై బ్రాంచ్ ఆడిట్ నిర్వహించినట్లు చెప్పారు.
2014-15 నుంచి 2016-17వరకు ఆడిట్ సర్టిఫికెట్లు అందినట్లు ఏపీ ప్రభుత్వం తమకు సమాచారం అందించిందన్నారు. 2017-18 నుంచి 2020-21వరకు పోలవరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చులకు సంబంధించిన లెక్కలపై అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వారు ఆడిట్ నిర్వహించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల(Funds of Polavaram project) గురించి వైకాపా ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని అడిగిన మరో ప్రశ్నకు బిశ్వేశ్వర్ సమాధానమిస్తూ 2014 ఏప్రిల్ 1 నుంచి పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంకోసం చేసే వ్యయాన్ని 100% కేంద్రం సమకూర్చనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చుచేసిన రూ.11,600.16 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు వివరించారు.