ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న వివిధ వివాదాస్పద అంశాల్లో రెండు అంశాలపై న్యాయసలహా తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉప సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ఫైనాన్సు కార్పొరేషన్ విభజన అంశాన్ని కేంద్ర లీగల్ కౌన్సిల్‌కు నివేదించనున్నారు. రెండోది.. విద్యుత్తు బకాయిల అంశంలో ఆంధ్రప్రదేశ్ కోర్టుకు వెళ్లినందున ఇందులో కేంద్ర హోంశాఖ జోక్యానికి ఎంతవరకు ఆస్కారం ఉందో చర్చించి తేల్చాలని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్ అధ్యక్షతన ఉప సంఘం తొలి సమావేశం గురువారం దృశ్య మాధ్యమంలో జరిగింది. పై రెండు అంశాలూ కాక.. మిగిలిన అన్ని విషయాల్లో సాంకేతిక అంశాలను అధ్యయనం చేసి మరో నెల రోజుల్లోగా ఇంకో సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు కమిటీ హామీ ఇచ్చింది. ఉపసంఘం గురువారం అయిదు అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులతో చర్చించింది. అయితే, విభజన నాటి నుంచి పెండింగులో ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలూ ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదనలు, అభిప్రాయాలనే మళ్లీ కమిటీ ముందు కూడా వినిపించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల పౌరసరఫరాల కార్పొరేషన్ల మధ్య నిధుల పంపిణీ, తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలు, రాష్ట్ర ఫైనాన్సు కార్పొరేషన్ విభజన, పన్నుల అంశాల్లో సందిగ్ధత తొలగింపు, బ్యాంకుల్లో నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన తదితర అంశాలు చర్చకు వచ్చాయి. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఈ విషయాల వల్ల రాష్ట్రానికి తలెత్తుతున్న ఇబ్బందులేంటో ఆంధ్రప్రదేశ్ అధికారులు ఉపసంఘానికి వివరించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు.
కేసులు వాపస్ తీసుకుంటేనే పరిష్కారం: తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: కేసులను ఉపసంహరించుకుంటే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు సానుకూలత ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్రం ఏపీకి స్పష్టం చేసింది. ‘పన్ను వివాదాల అంశం పరిష్కారానికి ఏపీ కోరుతున్నట్లు పునర్విభజన చట్టం సవరణ ఇప్పుడు అవసరం లేదు. చట్టం అమల్లోకి వచ్చిన ఏడున్నరేళ్ల తర్వాత సవరణ ఆమోదయోగ్యం కాదు. పైగా కొత్త వివాదాలకూ దారి తీస్తుంది. ఏపీ నష్టపోయిన మొత్తాన్ని కేంద్రం ఇస్తే సరిపోతుంది’ అని తెలంగాణ స్పష్టం చేయగా... ఈ అంశం రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాదంటూ హోంశాఖ దీన్ని ఎజెండా నుంచి తొలగించింది. ఈ వివరాలను తెలంగాణ ఒకప్రకటనలో తెలియజేసింది.