"గతంలో సిఫార్సుల మేరకే పద్మ పురస్కారాలు దక్కేవి. ప్రస్తుతం ప్రతిభ ఆధారంగానే అవార్డులు ఇస్తున్నాం. కాళ్లకు చెప్పులు లేని సామాన్యులు కూడా రాష్ట్రపతి భవన్‌కు వచ్చి అవార్డులు తీసుకున్నారు. ప్రతిభ, సేవతోనే పురస్కారాలు అందుకున్నారు." అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన హోం మంత్రి.. నెల్లూరులో జరుగుతున్న స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సేవలను కొనియాడారు. విద్యార్థి దశ నుంచే.. వెంకయ్య నాయకుడిగా ఉన్నారని చెప్పారు. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎదిగిన ఆయన.. జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు.
జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంకయ్యనాయుడు.. నాలుగుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారన్నారు. ఈ కాలంలో.. ఎన్నో ఉన్నత స్థాయి చర్చల్లో చురుకుగా పాల్గొన్నారని కితాబిచ్చారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే వెంకయ్య.. మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖనే ఎంచుకున్నారని చెప్పారు. రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని వెంకయ్యనాయుడు పరితపిస్తుంటారని అన్నారు.