Central On AP Govt Loans: రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలోని వివిధ కంపెనీలు, కార్పొరేషన్లకు 2019 ఏప్రిల్ 1 నుంచి 2021 నవంబరు 30 మధ్యకాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.57,479 కోట్ల అప్పులిచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ తెలిపారు. 2019 ఏప్రిల్ 1 నుంచి పది ప్రభుత్వరంగ బ్యాంకులు ఏపీ ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లకు రూ.41,029 కోట్ల రుణం అందించిన విషయం కేంద్రానికి తెలుసా? వీటికి వడ్డీ, అసలును రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చెల్లించిందా? అని మంగళవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం రుణం తీసుకున్న సంస్థలు ఇప్పటివరకు ఉన్న వడ్డీ, అసలు బకాయిలను చెల్లించాయన్నారు.
సెప్టెంబరు నాటికి రెవెన్యూ లోటు రూ.33,140 కోట్లు
ఏపీ ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో రెవెన్యూ లోటును రూ.5,000.06 కోట్లుగా చూపగా, సెప్టెంబరు 30 నాటికి అది రూ.33,140.62 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. తాజా ఆర్థిక సంవత్సరంలో ఏపీ రెవెన్యూలోటు 662.80%, ఆర్థికలోటు 107.70%కి చేరిన విషయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుందా? అని మంగళవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సెప్టెంబరు నాటికి కాగ్ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన తాత్కాలిక అన్ ఆడిటెడ్ నెలవారీ లెక్కలు ఈ విషయాన్ని వెల్లడించాయన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్థికలోటు కింద రూ.37,029.79 కోట్ల పద్దును చూపగా, సెప్టెంబరు 30 నాటికే ఇది రూ.39,914,18 కోట్లకు చేరిందన్నారు.
ఇదీ చదవండి : CM Jagan in SLBC Meeting: ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల చొప్పున రుణం ఇవ్వండి: సీఎం జగన్