పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అన్ని విధాలా సహకరిస్తామని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తయ్యే మొత్తం నిధులు తామే భరిస్తామని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం పేర్కొన్నా ఆచరణలో అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సవరించిన అంచనా మొత్తంలో వివిధ రూపాల్లో ఇంతవరకు రూ.15,037 కోట్లు కేంద్రం కోత పెట్టింది. కేవలం రూ.35,950.16 కోట్లకే పెట్టుబడి అనుమతి ఇస్తామని కేంద్ర మంత్రి తాజాగా ప్రకటించారు. ఆ ప్రక్రియా వేగంగా సాగడం లేదు. ఇప్పటికే సందేహాలపై సందేహాలు వ్యక్తం చేసి రెండు కీలక కమిటీలు ఈ అంచనాలను ఆమోదించినా మళ్లీ పోలవరం అథారిటీ కొర్రీలపై కొర్రీలు వేస్తోంది.
ఇంత కోత ఏ రూపంలో?
సవరించిన అంచనాలు రూ.55,548.87 కోట్లకు కేంద్ర జల సంఘం ప్రతిపాదిస్తే సాంకేతిక సలహా కమిటీ ఎప్పుడో 2019 ఫిబ్రవరిలో ఆమోదం తెలియజేసింది. ఆ తర్వాత అంచనాల సవరణ కమిటీ (రివైజ్డు కాస్ట్ కమిటీ- ఆర్‌సీసీ) ఆమోదమూ తీసుకోవాలని అనడంతో అక్కడికి చేరింది. ఆ కమిటీ చర్చలపై చర్చలు జరిపి రూ.7,823.13 కోట్ల కోత విధించింది. రూ.47,725.74 కోట్లకే 2020 మార్చిలో ఆమోదం తెలియజేసింది. ఇప్పుడు మళ్లీ ఇందులో తాగునీటి విభాగం నిధులు రూ.7,214.67 కోట్లు ఇవ్వబోమని కేంద్ర మంత్రి ప్రకటించారు. దీంతో ఇప్పటివరకూ అనేక కొర్రీల రూపంలో రూ.15,037.80 కోట్లను కోత పెట్టినట్లయింది. విద్యుత్కేంద్రం పనులకు రూ.4,560.91 కోట్లు ఖర్చవుతుంది. ఆ నిధులు ఏపీ అడగడం లేదు. అవి ఎలాగూ మినహాయించాల్సి ఉంది. అన్ని మినహాయింపులూ కలిపి ఇప్పుడు రూ.35,950.16 కోట్లకే పెట్టుబడి అనుమతి ఇస్తామంటున్నారు. అప్పట్లో సవరించిన అంచనాల కమిటీ ముందు అధికారులు రూ.7,823.13 కోట్లు కోత పడకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. పునరావాస, భూసేకరణ వ్యయంలోనే రూ.5,000 కోట్ల వరకు కోత పెట్టారు. భూములు సేకరించేందుకు నోటీసు ఇచ్చినప్పటి నుంచి డ్రాఫ్టు డిక్లరేషన్ వరకు ఉన్న మధ్య సమయంలో పరిహారంపై 12శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 2013 భూసేకరణ చట్టమే ఈ విషయం పేర్కొంటోంది. ఆ కేటగిరీ కింద ప్రతిపాదించిన నిధులను ఆర్‌సీ కమిటీ తిరస్కరించింది. కుడి, ఎడమ కాలువలకు పని పరిమాణం కింద కమిటీ సంతృప్తి చెందక రూ.2,800 కోట్ల మేర కోత పెట్టింది. ముందు ఆమోదింపజేసుకోండి... ఆనక అవసరమయితే సవరణ ప్రతిపాదన పెట్టి ఆ నిధులు పొందవచ్చని నాడు ఆర్‌సీసీ సభ్యులు కొందరు అధికారులకు చెప్పారు. ఇప్పుడు కొత్తగా మరికొంత కోతేశారు. ఇలా తాగు, సాగునీరు అన్న విభజన జాతీయ ప్రాజెక్టుల్లో లేదని కేంద్ర జల సంఘం పెద్దలు చెబుతున్నా అది పరిగణనలోకి తీసుకోకుండా కోత పెడుతున్నారంటూ రాష్ట్ర అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.