కరోనా పరిణామాలతో దేశీయ ఆర్థిక వ్యవస్థ పీకల్లోతు కష్టాల్లో కూరకుపోయిన నేపథ్యంలో పెట్టుబడుల ఉపసంహరణను మరింత బలంగా ముందుకు తీసుకుని వెళ్తోంది... కేంద్ర ప్రభుత్వం. రానున్న అర్థిక సంవత్సరంలో కూడా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఐడీబీఐ బ్యాంకు, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, పవన్ హాన్స్, ఎయిర్ ఇండియా కంపెనీల్లో వ్యూహాత్మక వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించనున్నారు. మరోవైపు ఒక ఇన్సూరెన్స్ సంస్థతోపాటు ఇప్పటికే వాటాల విక్రయం ప్రకటించి ఉన్న కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఈ ఏడాది పూర్తి చేయనున్నారు. ఎల్ఐసీ ఐపీఓ చేపట్టేందుకు అవసరమైన చట్టబద్ధమైన సవరణను ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించింది.
క్రమంగా ప్రైవేటు భాగస్వామ్యం
ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక ప్రకారం... పెట్టుబడులు ఉపసంహరించే రంగాలను వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలుగా విభజించారు. ఈ మేరకు నాలుగు వ్యూహాత్మక రంగాలను మినహాయించి, మిగిలిన ప్రభుత్వ కంపెనీల్లో క్రమంగా ప్రైవేటుకు భాగస్వామ్యం కల్పిస్తారు. వ్యూహాత్మక విభాగంలో పెట్టుబడులు ఉపసంహరించాల్సిన ప్రభుత్వ రంగ కంపెనీలు, సంస్థలను గుర్తించి, జాబితా సిద్ధం చేయాలని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీతిఆయోగ్ ను కోరారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసే పక్రియను త్వరతగతిన నిర్వహించేందుకు మెరుగైన పద్ధతిని రూపొందించాలని సూచించారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఇందుకోసం ఆయా సంస్థలకు చెందిన భూములను వినియోగించుకునే ప్రణాళికను అభివృద్ధి చేయాలని కోరారు.
లక్ష్యం 1.75 లక్షల కోట్లు