ప్రజలకు సరఫరా చేయడానికి డిస్కంలు ‘విద్యుదుత్పత్తి కేంద్రాల’ (జెన్‌కో) నుంచి రోజూ విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంటాయి. కొన్న రోజు నుంచి 60 రోజుల్లోగా సొమ్ము చెల్లించాలి. నష్టాల వల్ల అన్ని డిస్కంలు ఈ సొమ్మును సరిగా చెల్లించకపోవడంతో దేశవ్యాప్తంగా బకాయిలు గత ఫిబ్రవరి చివరికి రూ. 94 వేల కోట్లకు చేరాయి. తెలంగాణ డిస్కంలు రూ.5562, ఏపీ డిస్కంలు రూ.2510 కోట్ల వరకూ బకాయి పడ్డట్టు సమాచారం. మార్చి చివరి నుంచి లాక్‌డౌన్ రావడంతో విద్యుత్ డిమాండ్ పడిపోయి, డిస్కంల ఆదాయం మరింత దిగజారింది.
ఉదాహరణకు గత నెలలో తెలంగాణ డిస్కంలకు ప్రజల నుంచి కరెంటు బిల్లుల రూపంలో రూ.2600 కోట్లకు గాను రూ.900 కోట్లు తక్కువగా వచ్చింది. ఫలితంగా జెన్‌కోలకు చెల్లింపులు మరింత ఆలస్యమవుతున్నాయి. ఈ చెల్లింపుల కోసం డిస్కంలకు ‘విద్యుత్ ఆర్థిక సంస్థ’ (పీఎఫ్‌సీ) లేదా ‘గ్రామీణ విద్యుదీకరణ సంస్థ’ (ఆర్‌ఈసీ)ల నుంచి రూ.90 వేల కోట్లు అప్పులుగా ఇప్పిస్తామని కేంద్రం ప్యాకేజీలో ప్రకటించింది.
ఏపీ, తెలంగాణ డిస్కంలకు దాదాపు రూ.6 వేల కోట్ల వరకూ అప్పులు వచ్చే అవకాశాలున్నాయి. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలు ఇచ్చే అప్పులపై సాధారణంగా 10 నుంచి 12 శాతం వడ్డీ వసూలు చేస్తుంటాయి. జెన్‌కోలకు 60 రోజుల తరువాత ఉండే బకాయిలపైనా 10 శాతానికి పైగా వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ప్యాకేజీలో వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో తేలాల్సి ఉంది.