కేంద్ర ఆర్థికశాఖ 2021-22 తొలి త్రైమాసికానికి నిర్దేశించిన మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరో పది రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్ నుంచి జీఎస్‌డీపీలో 0.25%కి సమానమైన రూ.15,721 కోట్లు అదనపు రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీనివల్ల ఏపీకి రూ.2,655 కోట్ల అదనపు రుణం పొందడానికి వీలవుతుంది. ఈ జాబితాలో బిహార్, ఛత్తీస్‌గఢ్, హరియాణ, కేరళ, మధ్యప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, నాగాలాండ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. ఈ అదనపు రుణ సేకరణకు అనుమతి వల్ల మూల ధన వ్యయాన్ని మరింత పెంచడానికి అవసరమైన వనరులు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులోకి వస్తాయని కేంద్రం పేర్కొంది.
మూలధన వ్యయంతో బహుముఖ ప్రభావం ఉంటుందని, దానివల్ల భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక ఉత్పాదకత పెరిగి అధిక వృద్ధి సాధ్యమవుతుందని విశ్లేషించింది. అందుకే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ మార్కెట్ నుంచి (జీఎస్‌డీపీలో 4%) తీసుకొనే రుణాల్లో, 0.50% (జీఎస్‌డీపీలో) మొత్తాన్ని మూలధన వ్యయం కోసం ఖర్చుచేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విధించింది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం పూర్తయ్యేనాటికి అందులో 15%, రెండో త్రైమాసికం పూర్తయ్యేనాటికి 45%, మూడో త్రైమాసికం పూర్తయ్యేనాటికి 70%, నాలుగో త్రైమాసికం పూర్తయ్యేనాటికి 100% ఖర్చుచేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లక్ష్యాలను పూర్తిచేసిన రాష్ట్రాలకు ప్రతి త్రైమాసికానికి ఒకసారి అదనపు రుణం తీసుకోవడానికి అనుమతిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు 0.25% రుణ సేకరణకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఖర్చుపై వచ్చే డిసెంబరులో రెండో విడత సమీక్షిస్తారు. సెప్టెంబర్ 30వ తేదీవరకు చేసిన ఖర్చులను విశ్లేషించి అప్పుడు నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిచేసి ఉంటే మరో 0.25% అప్పునకు అనుమతిస్తారు.