ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ వాటాపైనా ఆంధ్రప్రదేశ్‌ అప్పు.. - debts in the state

ఉమ్మడి రాష్ట్ర రుణాన్ని తిరిగి చెల్లించేటప్పుడు తెలంగాణ వాటాను ఆంధ్రప్రదేశ్‌ కలిపి చూపించినట్లు కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఆ పేరుతో ఎక్కువ అప్పులు తీసుకోవడం వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సర రుణ పరిమితిలో కోత వేసినట్లు తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఏపీ రుణపరిమితిని 27 వేల668 కోట్లకే పరిమితం చేస్తున్నట్టు.. రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్ రావత్‌కు ఇటీవల రాసిన లేఖలో స్పష్టంచేసింది.

appu
ఆంధ్రప్రదేశ్‌ అప్పు

By

Published : Jul 11, 2021, 5:18 AM IST

ఈ ఏడాది రాష్ట్రానికి 42 వేల 472 కోట్ల రుణ పరిమితి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని అంగీకరించకపోవడానికి కారణాలు చెబుతూ.. కేంద్ర ఆర్థికశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుమిత్‌ అగర్వాల్‌ జూన్‌ 30న రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. 2016-17 నుంచి 2019-20 వరకు తెలంగాణ వాటాగా చెల్లించిన అప్పునకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్‌ రుణం తెచ్చుకుందన్నారు. 15 వేల25 కోట్లు అధికంగా పరిమితిని వినియోగించుకుందని గుర్తించినట్టు లేఖలో పేర్కొన్నారు. ఇకపై ఏపీ రుణాల చెల్లింపులకు సంబంధించిన వివరాలు కేంద్రానికి తెలియజేసేటప్పుడు.. ఎంత మొత్తం రాష్ట్రానికి సంబంధించిందో, ఎంత మొత్తం తెలంగాణకు చెందినదో స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.

రాష్ట్రం తీసుకున్న రుణంలో ఎంత మొత్తాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో తిరిగి చెల్లిస్తారో.. ఆ మేరకు మళ్లీ రుణం తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పిస్తుంది. దీన్ని రీప్లేస్‌మెంట్‌ బారోయింగ్‌ అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న అప్పు ఇప్పటికీ తిరిగి చెల్లిస్తున్నారు. అప్పుడు తీసుకున్న అప్పులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో రుణం తిరిగి చెల్లించాలన్న విషయంలో స్పష్టత ఉంది. తెలంగాణ చెల్లించాల్సిన వాటాను కూడా ఏటా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే చెల్లిస్తోంది. తర్వాత ఆ మొత్తాన్ని తెలంగాణ సర్కార్ ఏపీకి సర్దుబాటు చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పేరుతో తీసుకున్న అప్పుని తిరిగి అదే హెడ్‌ కింద చెల్లించాల్సి ఉండటంతో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. తెలంగాణ వాటాగా చెల్లించిన మొత్తం కూడా లెక్కల్లో ఏపీ చెల్లించినట్టే ఉండటంతో.. ఆ మేరకు రాష్ట్రానికి అదనంగా రుణం తీసుకునే వెసులుబాటు లభించింది. దీనివల్ల ఏపీ, తెలంగాణ కలిపి చెల్లిస్తున్న రుణమొత్తం కంటే అదనపు పరిమితితో రుణం పొందే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో 2016-17 నుంచి 2019-20 వరకు తెలంగాణ అప్పుగా చెల్లించిన 15 వేల25 కోట్ల అప్పు పరిమితిని.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ వాటా నుంచి కేంద్రం మినహాయించింది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, అకౌంటింగ్‌ విధానం అస్తవ్యస్తంగా ఉందనడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా రాసిన లేఖ మరో నిదర్శనమని.. తెలుగుదేశం సీనియర్‌ నేత, పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు. 41 వేల కోట్ల నిధుల్ని లెక్కాపత్రం లేకుండా వినియోగించిన విషయాన్ని తాము బయటపెడితే పీడీ ఖాతాల్లోకి సర్దుబాటు చేశామని, ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి చెప్పడాన్ని తప్పుబట్టారు. అంతా బాగుంటే.. రాష్ట్ర రుణ పరిమితిలో కేంద్ర ప్రభుత్వం 17 వేల కోట్ల మేర కోత పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details