ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"రాష్ట్రంలో 8వ తరగతి విద్యార్థులకు.. కూడికలు రావట్లేదు!" - తరగతికి తగిన పరిజ్ఞానం లేదన్న జాతీయ సాధన సర్వే

రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు తరగతికి తగిన పరిజ్ఞానం ఉండటంలేదని.. జాతీయ సాధన సర్వే వెల్లడించింది. కనీసం కుటుంబ సభ్యుల వరుసలూ చెప్పలేని 5వ తరగతి పిల్లలు ఉన్నారని సర్వే తేల్చింది. కేంద్ర విద్యాశాఖ దేశవ్యాప్తంగా గత నవంబరులో నిర్వహించిన జాతీయ సాధన సర్వే నివేదిక-21ను విడుదల చేసింది.

study in schools
తరగతికి తగిన పరిజ్ఞానం లేదు

By

Published : Jun 4, 2022, 11:48 AM IST

రాష్ట్రంలో 3, 5, 8, 10 తరగతులు చదువుతున్న వారిలో విద్యా సామర్థ్యాల (తరగతికి తగిన పరిజ్ఞానం) సగటు 50 శాతంలోపే ఉంది. మూడో తరగతి విద్యార్థుల్లో 46 శాతం మంది తెలుగు పద్యాలు, పోస్టర్లు, తరగతి గదుల్లో గోడలకు అంటించిన స్క్రిప్ట్‌లను చదవలేకపోతున్నారు. ఎనిమిదో తరగతిలో 55 శాతం మంది పెద్ద సంఖ్యలతో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలను చేయలేకపోయారు. కేంద్ర విద్యాశాఖ దేశవ్యాప్తంగా గత నవంబరులో నిర్వహించిన జాతీయ సాధన సర్వే నివేదిక-21ను విడుదల చేసింది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో నాలుగు తరగతుల్లోని విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించి, అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసింది. 2017లో నిర్వహించిన సర్వేలో కంటే ఇప్పుడు ఫలితాలు మరింత దారుణంగా వచ్చాయి.

* మూడో తరగతి తెలుగు, గణితం, పర్యావరణం సబ్జెక్టులపై నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్ర సరాసరి స్కోరు 54.2 శాతం కాగా.. జాతీయ సగటు 59 శాతం. ప్రాథమిక, ప్రాథమిక స్థాయి కంటే తక్కువ స్థాయిలోని విద్యార్థులే 65.6 శాతం మంది ఉన్నారు.

* గడియారంలో సమయాన్ని 66 శాతం మందే కచ్చితంగా చెప్పగలిగారు.

* గణితంలో మూడంకెల స్థాన విలువలను 54 శాతం మంది రాయలేకపోయారు. చదవలేకపోయారు.

* మూడంకెలతో కూడిన కూడికలు, తీసివేతలను సగం మందే చేయగలిగారు.

గణితంలో ప్రభుత్వ విద్యార్థులు 42 శాతమే:ఐదో తరగతిలో తెలుగు, గణితం, పర్యావరణంపై నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు సరాసరిన 43.2 శాతం స్కోరు సాధించారు. ఇది జాతీయ సగటు కంటే ఆరు శాతం తక్కువ. ప్రాథమిక, ప్రాథమిక స్థాయి కంటే దిగువన ఉన్నవారు 65.6 శాతం ఉండటం గమనార్హం.

* తెలుగులో సరిగా చదవలేకపోయినవారు సరాసరిన 53 శాతం మంది.
* 43 శాతం మంది కుటుంబ సభ్యులు, వారి బంధాలను సరిగా చెప్పలేకపోయారు.

8లో జాతీయ సగటు కంటే దిగువనే..ఎనిమిదో తరగతిలో ఏపీ స్కోరు (38.7%) జాతీయ సరాసరి (41.9%) కంటే తక్కువ. ప్రాథమిక, ప్రాథమిక స్థాయి కంటే దిగువన ఉన్న విద్యార్థులు 80.8 శాతం మంది.

* పెద్ద సంఖ్యలను ఉపయోగించి కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలను 55% మంది చేయలేకపోయారు.
* సాంఘికశాస్త్రంలో అక్షాంశాలు, రేఖాంశాల్లో ధ్రువాలు, భూమధ్యరేఖ లాంటి వాటిని 66 శాతం మంది గుర్తించలేకపోయారు.

పదిలో లెక్కలు సరిగా చేసినవారు 29 శాతమే..:పదోతరగతి గణితంలో సరైన సమాధానాలు రాసిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 29 శాతం మంది. సామాన్య శాస్త్రంలో 31, సాంఘిక శాస్త్రంలో 33, ఆంగ్లంలో 40, తెలుగులో 37 శాతం మందే సరైన జవాబులు రాశారు. పదిలో జాతీయ స్థాయి సరాసరి స్కోరు (37.8%) కంటే రాష్ట్ర సరాసరి (38.1%) స్వల్పంగా ఎక్కువ. ప్రాథమిక స్థాయి, అంతకంటే తక్కువలో ఉన్న విద్యార్థులు 76.9 శాతం మంది ఉన్నారు.

సర్వే స్వరూపం:
పాల్గొన్న పాఠశాలలు: 2,068,
ఉపాధ్యాయులు: 8,454, విద్యార్థులు: 59,226

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details