ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని రాష్ట్రం ఇష్టమే.. హైకోర్టులో కేంద్ర హోంశాఖ కౌంటర్ దాఖలు - ఏపీ మూడు రాజధానులు తాజా వార్తలు

రాష్ట్ర రాజధాని నగరాన్ని నిర్ణయించేది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి పాత్ర ఉండదని కేంద్ర హోంశాఖ మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఏపీ సీఆర్ డీఏను రద్దు చేస్తూ.. కొత్త చట్టాన్ని రూపొందించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం .. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని కౌంటర్​లో తెలిపింది.

రాజధాని రాష్టం ఇష్టమే.. హైకోర్టులో కేంద్ర హోంశాఖ కౌంటర్ దాఖలు
రాజధాని రాష్టం ఇష్టమే.. హైకోర్టులో కేంద్ర హోంశాఖ కౌంటర్ దాఖలు

By

Published : Aug 20, 2020, 6:19 AM IST

Updated : Aug 20, 2020, 11:51 AM IST

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాన్ని సవాలు చేస్తూ అమరావతి రాజధాని ప్రాంత రైతులు డి.సాంబశివరావు, టి.శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ లలిత టి.హెడావు ఈ వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేశారు.

  • కౌంటర్​లో ముఖ్యాంశాలివీ..

'ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం -2014 సెక్షన్ 6 ప్రకారం .. ఏపీకి కొత్త రాజధాని విషయంలో ప్రత్యామ్నాయాల్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ కేసీ శివరామకృష్ణన్ సారథ్యంలో 2014 మార్చి 28న నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 2014 ఆగస్టు 30న ఆ కమిటీ సమర్పించిన నివేదికను సెప్టెంబర్ 1న ఏపీ ప్రభుత్వానికి పంపాం. అమరావతిని రాజధాని నగరంగా నోటి ఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 28 న ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం కొత్త రాజధానిలో రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసన మండలి, ఇతర మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు విడుదల చేసిన నిధుల వివరాల్ని కౌంటర్ తో జతచేశాం. పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం-2020 కి సంబంధించి ఈ ఏడాది జులై 31న రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ప్రకటన జారీచేసింది. శాసన రాజధానిగా అమరావతి మోట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ ఏరియా, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం మోట్రోపాలిటన్ రీజియన్ డెవలప్​మెంట్​ ఏరియా, జ్యుడీషియల్ రాజధానిగా కర్నూల్ అర్బన్ డెవలప్​మెంట్ ఏరియా ఉంటాయని, మూడు రాజధానులను ఆ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఏపీ సీఆర్డీఏ రద్దు చట్టాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టి దానిని ఆమోదించారు. ఆ చట్టాన్ని రూపొందించేటప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించలేదు. ఈ విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది. అందులో కేంద్ర ప్రభుత్వం భాగం కాలేదు . ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తగిన ఆదేశాలు జారీచేయండి' అని కౌంటర్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీం విచారణ వాయిదా

Last Updated : Aug 20, 2020, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details