CENTER ORDERS TO TELANGANA: ఏపీ జెన్‌కోకు బకాయిలను వడ్డీతో కలిపి చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థలను కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్‌కు రూ.3,441.78 కోట్లు, దీని చెల్లింపులో జాప్యానికి సర్‌ఛార్జీ రూపేణా రూ.3,315.14 కోట్లు (2022 జులై 31 వరకు) కలిపి మొత్తంగా రూ.6,756.92 కోట్లు 30 రోజుల్లో చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
‘తెలంగాణ విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి అనేకసార్లు వినతిపత్రాలు వచ్చాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం బకాయిలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ సరఫరా జరిగినందున విభజన వివాదాలతో దీన్ని ముడిపెట్టడానికి వీల్లేదు. 30 రోజుల్లోగా ఏపీ జెన్‌కోకు ఉన్న బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని ఆదేశిస్తున్నాం’ అని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అనూప్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. వీటిని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, డిస్కంల సీఎండీలు, ఏపీ జెన్‌కో ఎండీకి పంపారు.
బకాయిలపై కోర్టులో కేసులు
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ (పోసోకో) 2014 మార్చి 28న ఉమ్మడి రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించింది. విభజన చట్టం నిబంధనల మేరకు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాలని 2014 జూన్ 18న ఏపీ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు (ఏపీఎస్‌ఎల్‌డీసీ) లేఖ రాసింది. దీని ప్రకారం 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసింది. ఉత్పత్తి సంస్థలతో ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) ధరల ప్రకారం తీసుకున్న విద్యుత్‌కు తెలంగాణ డిస్కంలు డబ్బు చెల్లించాలి.
ఈ కాలంలో ఏపీ సరఫరా చేసిన విద్యుత్‌కు రూ.3,441.78 కోట్లు కట్టాలి. దీనిపై పలుమార్లు ఏపీ జెన్‌కో లేఖలు రాసినా పట్టించుకోలేదు. బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏపీ జెన్‌కో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో కేసు వేసింది. అక్కడా వివాదం పరిష్కారం కాకపోవడంతో కేసును ఉపసంహరించుకొని, తెలంగాణ విద్యుత్ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. అయినా, ప్రయోజనం లేకపోవడంతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విభజన అంశాలను విద్యుత్ బకాయిలతో ముడిపెట్టి తెలంగాణ విద్యుత్ సంస్థలు కౌంటర్ పిటిషన్ వేశాయి. తెలంగాణ విద్యుత్ సంస్థలు పేర్కొన్న అంశాలకు, విద్యుత్ బకాయిలకు సంబంధం లేదని ఏపీ జెన్‌కో కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.