ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Electricity purchase from DISCOM డిస్కంలకు షాక్‌, తెలుగు రాష్ట్రాలతో సహా - విద్యుత్​ కొనుగోళ్లపై నిషేధం

Electricity purchase from DISCOM డిస్కంలకు కేంద్రం షాక్‌ ఇచ్చాయి. తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలు ఎక్స్ఛేంజీల్లో కరెంటు కొనకుండా కేంద్రం నిషేధం విధించింది. విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించని ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు తప్పవా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

DISCOMs
డిస్కంలకు రాష్ట్రాలు షాక్‌

By

Published : Aug 19, 2022, 7:12 AM IST

Electricity purchase from DISCOM తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించింది. విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొన్న కరెంటుకు నిర్దేశిత వ్యవధిలో బిల్లులు చెల్లించలేదన్న కారణంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కారణంగా రెండు రాష్ట్రాల డిస్కంలు ఎక్స్ఛేంజీ ద్వారా విద్యుత్‌ కొనుగోలు, మిగులు విద్యుత్‌ అమ్మకాలకు శుక్రవారం అవకాశం ఉండదు. చర్యలను ఉపసంహరించే వరకు డిస్కంలు ఇదే పరిస్థితిని ఎదుర్కోనున్నాయి. కేంద్రం నిషేధం విధించిన వాటిలో మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మణిపుర్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, జమ్మూ-కశ్మీర్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, మిజోరం, రాజస్థాన్‌ రాష్ట్రాల డిస్కంలు కూడా ఉన్నాయి. నిషేధం వల్ల తలెత్తే లోటు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు విధించే అవకాశం ఉంది. తెలంగాణలో వ్యవసాయ బోర్లకు త్రీఫేజ్‌ కరెంటును శుక్రవారం ఉదయం 7.30 నుంచి సాయంత్రం 3 లేదా 4 గంటల వరకు, తిరిగి రాత్రి 10.30 నుంచి తెల్లవారుజామున అయిదున్నర వరకు ఇచ్చేందుకు డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఎల్‌పీఎస్‌ నిబంధనల్లో భాగంగా ప్రత్యేక పోర్టల్‌ను కేంద్రం రూపొందించింది. ఇందులో వివిధ రాష్ట్రాల డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్‌.. చెల్లించాల్సిన బిల్లు మొత్తాలను విద్యుదుత్పత్తి సంస్థలు ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జులై, ఆగస్టు నెలల్లో డిస్కంలు తీసుకున్న విద్యుత్‌ బిల్లులను ఇంధన ఉత్పత్తి సంస్థలు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాయి. అప్‌లోడ్‌ చేసిన తేదీనే ప్రామాణికంగా తీసుకుని బకాయిలున్నాయంటూ కేంద్రం చర్యలు తీసుకుంది. వాస్తవానికి బిల్లు ఇచ్చిన తర్వాత 45 రోజుల వరకు చెల్లింపు వ్యవధి ఉంటుంది. ఈలోగా సరఫరా చేసిన విద్యుత్‌ ఎంత? బిల్లులో పేర్కొన్న విధంగా యూనిట్‌ ధరలు ఉన్నాయా? ఇలాంటి అంశాలను పరిశీలించిన తర్వాతే ఉత్పత్తి సంస్థలకు బిల్లులను చెల్లిస్తుంటామని డిస్కంలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. దీన్ని పరిశీలించి నిషేధిత జాబితా నుంచి శుక్రవారంలోగా ఏపీ డిస్కంలను తొలగించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ‘డిస్కంలు చేసిన చెల్లింపుల సమాచారం యాప్‌లో అప్‌డేట్‌ కాలేదు. దీంతో బకాయిలు కనిపిస్తున్నాయి. ఇలా నెల రోజుల వ్యవధిలో దేశంలోని వివిధ డిస్కంలు సుమారు రూ.5 వేల కోట్ల బకాయిలున్నట్లు యాప్‌ చూపుతోంది’ అని అధికారులు పేర్కొన్నారు.

* అవసరాల మేరకు శుక్రవారం రియల్‌టైం మార్కెట్‌లో విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని ఏపీ ఇంధన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పీక్‌ డిమాండ్‌ సమయంలో రోజుకు 10-15 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం అవుతుందన్నారు.

* విద్యుత్‌ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు మెయిల్‌ ద్వారా విద్యుత్‌ ఎక్స్ఛేంజీకి లేఖ రాశారు.

* తెలంగాణలో గురువారం గరిష్ఠ విద్యుత్‌ డిమాండు 12,114 మెగావాట్లు నమోదైంది. గత ఏడాది ఇదే రోజు (2021 ఆగస్టు 18)న 8500 మెగావాట్లు మాత్రమే డిమాండు ఉంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పెద్దగా లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, ఇళ్లకు, వ్యవసాయానికి వినియోగం పెరగడంతో డిమాండు ఎక్కువైంది.

* ప్రస్తుతం కృష్ణానదిలో పెద్ద ఎత్తున వరద వస్తున్నందున తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల ఎక్స్ఛేంజీల్లో కొనుగోలు తక్కువగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం గరిష్ఠ డిమాండు సమయంలో డిస్కంలు 2 వేల మెగావాట్ల దాకా ఎక్స్ఛేంజీలో కొంటున్నాయి. శుక్రవారం నుంచి నిషేధం విధించినందున ఈ మేర వ్యవసాయానికి త్రీఫేజ్‌ సరఫరా తగ్గించాలని డిస్కంలు యోచిస్తున్నాయి. సమస్య పరిష్కారమైతే ఎలాంటి కోతలు ఉండవని అధికారులు చెబుతున్నారు.

ఇదీ నేపథ్యం:కేంద్ర ఇంధన శాఖ 2022 జూన్‌ నుంచి లేట్‌ పేమెంట్‌ సర్‌ఛార్జి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యుదుత్పత్తి సంస్థలకు బిల్లులను నిర్దేశిత వ్యవధిలో చెల్లించాలి. తెలంగాణ రూ.1,600 కోట్లు, ఏపీ రూ.350 కోట్లు బకాయిలున్నాయంటూ.. విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో లావాదేవీలపై కేంద్రం నిషేధం విధించింది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details