రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో మూడింటికి కలిపి 585 కోట్ల రూపాయలను తన వాటా కింద అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 నూతన వైద్య కళాశాలల ఏర్పాటుకు నిధులు అందజేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై పరిశీలన జరిపిన కేంద్రం తొలివిడత కింద... గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖపట్నం జిల్లాలోని పాడేరు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలలకు తన వాటా కింద రూ.195 కోట్ల వంతున అందజేసేందుకు ఆమోదం తెలిపింది.
ఒక్కో వైద్య కళాశాల ఏర్పాటుకు 325 కోట్ల రూపాయల వరకూ వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు . ఇందులో కేంద్రం తన వాటా కింద 60% నిధులు అందజేస్తుంది. మిగిలిన వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. రాజమండ్రి, నంద్యాల, అనకాపల్లి, పెనుకొండ, మదనపల్లి, నరసాపురం, బాపట్ల, మార్కాపురంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ దాదాపు పూర్తయింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, గురజాల, అమలాపురం, ఆదోని, పులివెందులలో ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల ఏర్పాటుకు స్థల సేకరణ వివిధ దశల్లో ఉందని అధికారులు చెబుతున్నారు.