భూముల రీసర్వే ప్రాజెక్టులో కీలకమైన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల బదిలీకి సీసీఎల్ఏ (Chief Commissioner of Land Administration).. ప్రభుత్వ అనుమతిని కోరింది. సర్వే విభాగంలోని ఉద్యోగుల బదిలీలకూ అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాసింది. రెవెన్యూ, సర్వే విభాగాల్లోని ఉద్యోగుల బదిలీకి 15 రోజుల విండో పిరియడ్ ను ఇవ్వాలని.. రీసర్వే కోసం బదిలీ చేసిన ఉద్యోగులకు కనీసం మూడేళ్లపాటు బదిలీ ఉండబోదన్న నిబంధన విధించాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉన్నందున ఈ వెసులుబాటు కల్పించాలని సీసీఎల్ఏ.. ప్రభుత్వాన్ని కోరింది. భూముల రీసర్వే ప్రాజెక్టులో సరైన వ్యక్తి సరైన చోట ఉండాలన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు లేఖలో పేర్కొంది. భూసర్వే కోసం రెవెన్యూ చట్టాల్లో నైపుణ్యమున్న డిప్యూటీ తహసీల్దార్లకు పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేసినట్టు వెల్లడించింది.
రీసర్వే ఉద్దేశ్యం..
రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే కోసం నిర్దేశించిన ‘'వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష' పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి రీసర్వే పూర్తి చేశారు. ఇక్కడ పొలాలల్లో సరిహద్దు రాయి పాతి... సీఎం జగన్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. కార్స్ పరిజ్ఞానం, డ్రోన్లు, రోవర్లు వంటి అత్యాధునిక సదుపాయాలను భూముల రీసర్వేలో వినియోగిస్తున్నారు.
విడతల వారీగా....రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా 26 వేల చదరపు కిలోమీటర్ల మేర సర్వే చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భూ తగాదాలు లేని ప్రజా వ్యవస్థను నిర్మించడం భూముల రీసర్వే లక్ష్యం. భూమి స్వభావం, సాగు చేసే పంటలు, యజమాని వివరాలు సేకరిస్తారు. భూముల చుట్టూ రాళ్లు బిగిస్తారు. సర్వే అనంతరం రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేసి సెటిల్మెంట్ చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా విలేజ్ మ్యాప్ తయారు చేయనున్నారు.
ఇదీ చదవండి:
Amaravthi Assigned Lands: సీఐడీ విచారణకు ఎస్సీ రైతు పోలా రవి.. సాక్షి సంతకాలపై ఆరా