ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్ విషవాయువు ప్రభావానికి ప్రజలు అస్వస్థతకు గురైన సీసీటీవీ కెమెరా దృశ్యాలు.. ప్రమాద తీవ్రతను కళ్లకు కట్టాయి. దట్టమైన మంచు కురిసినట్లు పరిశ్రమ నుంచి స్టైరీన్ ఆవిర్లు వెంకటాపురం గ్రామంలోకి వ్యాపించిన తీరు ఈ దృశ్యాల్లో ఉంది. వెంకటాద్రినగర్‌కు చెందిన జి.శ్రీనివాస్ తన ఇల్లు, కాలనీని అనుసంధానిస్తూ ఏర్పాటుచేసిన మూడు సీసీటీవీ కెమెరాల్లో ఇవి నమోదయ్యాయి. ఈ కెమెరాలున్న వెంకటాద్రినగర్ ప్రాంతం.. సరిగ్గా స్టైరీన్ ట్యాంకర్ల వెనకే ఉంది. దీంతో ఆ కాళరాత్రి దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి.
పిల్లలు, పెద్దలు ఇళ్లు విడిచి పరుగులు పెట్టి.. ఆ వెంటనే కుప్పకూలిపోయారు. కొందరు వాంతులు చేసుకోవడం, సొమ్మసిల్లిపోవడం కూడా ఆ దృశ్యాల్లో ఉంది. లోపలి నుంచి బయటకొచ్చి గేటు తీయడానికీ ఇబ్బంది పడ్డారంటే ఆవిర్ల గాఢత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పిల్లలు కుప్పకూలిన దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. మహిళలు నడుస్తూ రోడ్ల మీదే పడిపోయారు. ఎవరికి వారు ప్రాణాలను అరచేత పెట్టుకొని పరుగులు తీశారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ప్రకారం 7వ తేదీ తెల్లవారుజాము నుంచి ఊళ్లోకి పొగలు వస్తున్నట్లు కనిపించింది. 3-4 గంటల మధ్య స్టైరీన్ ఆవిర్లు తక్కువ రాగా, 4-5 గంటల మధ్య దట్టంగా వచ్చినట్లు కెమెరాల్లో నమోదైంది. ఈ సమయంలో బయటకు వచ్చిన వారిలో కొందరు తీవ్ర అస్వస్థతకు గురికాగా, మరికొందరు మరణించారని కాలనీ వాసులు చెబుతున్నారు. ఉదయం 6 గంటల వరకూ గ్రామాన్ని పొగలు వదల్లేదు. ఆ తర్వాత సహాయక బృందాలు వచ్చి, వీధుల్లో పడిపోయిన వారిని వాహనాల్లో తరలించాయి.