ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతుండటం, రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడో స్థానంలో ఉండటం విషాదకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పది మందికి అన్నం పెట్టే రైతన్నలంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష అన్నారు. రైతు సోదరులందరికీ జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా రాజధాని అమరావతి ప్రాంత రైతులు 372 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉద్యమిస్తున్నారని.. వీరిలో 10 మందికి పైగా అన్నదాతలు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన అప్పు పరిధిని పెంచుకోవటానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుపై మరింత భారం వేయనుందని ఆరోపించారు.
వరుస వరదలు, భారీ వర్షాలు, నివర్ తుపాన్ విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో బైఠాయించి పట్టుబట్టేదాకా పంటబీమా ప్రీమియం కట్టలేదంటే రైతుల పట్ల పాలకులకెంత నిర్లక్ష్యమో తెలుస్తుందన్నారు. రైతుకు పరిహారం అడిగితే సభలో తమపైనే దాడికి తెగబడ్డారని మండిపడ్డారు.