రాష్ట్ర గవర్నర్‌కు బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరితే తమ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో కలెక్టర్ స్పందించకపోవడం వల్ల నేరుగా వెళ్లి కలవాలని ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారని వివరించారు. కలెక్టర్‌ను కలిసి నేరుగా వినతిపత్రం ఇవ్వాలని ఎమ్మెల్యే రామానాయుడు ప్రయత్నించారని చెప్పారు. భీమవరం వద్ద ఆయనను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారన్నారు.
ఈ సమయంలో నరసాపురం, భీమవరం వైకాపా ఎమ్మెల్యేలు వందలాది మందితో సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పశుసంవర్థక శాఖమంత్రి, జిల్లా కలెక్టర్ సైతం 200 మందితో సమావేశం నిర్వహిస్తే వారిపైనా ఎలాంటి చర్యలు లేవని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతు సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని చంద్రబాబు... గవర్నర్‌ను కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.